ACB Investigation on HMDA ex Director Sivabalakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల అతన్ని 8 రోజుల కస్టడీలో ఉంచి విచారించారు. ఆ సమయంలో శివబాలకృష్ణ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సదరు అధికారి ఆదేశాల మేరకు పలు అనుమతులు జారీ చేసి రూ.కోట్లు ఆర్జించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో సదరు ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో దర్యాప్తు సంస్థ ఉన్నట్లు సమాచారం. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధం అవుతోంది. తొలుత 160/161 నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆ ఐఏఎస్ వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో శివబాలకృష్ణ బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సాప్ సంభాషణలు జరిగాయని, అక్రమంగా ఆర్జించిన నగదును ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ వీరు మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో శివబాలకృష్ణ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లను ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు. వాట్సాప్ డేటా రిట్రీవ్ చేసేందుకు యత్నిస్తున్నారు. భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందు ఉంది. అలాగే, సదరు ఐఏఎస్ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ఇచ్చిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నారని నిరూపించాలి. ఈ క్రమంలో పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి.. కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులు అధికారులు తీసుకోనున్నారు.
ఈడీ, ఐటీ ఎంట్రీ
మరోవైపు, శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ సైతం ఫోకస్ పెట్టాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టనుంది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌తో పాటు ఇతర పత్రాల కాపీలన్నీ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి ఈడీ లేఖ పంపింది. ఏసీబీ నుంచి వివరాలు అందిన వెంటనే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. అటు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటీ) కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతోంది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద శివబాలకృష్ణ బినామీలపై విచారణ జరపనుంది ఆదాయపు పన్ను శాఖ.
ఆస్తుల విలువ ఎంతంటే.?
అధికారాన్ని ఉపయోగించుకుని హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1000 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ (ACB) దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ.250 కోట్ల ఆస్తులను బాలకృష్ణ అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ నాలుగు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కేసులో శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్‌ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో... ఇప్పటివరకు 214 ఎకరాల పొలం, 29 ప్లాట్లు, ఏడు ఫ్లాట్లు, ఒక విల్లా, 5.5 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. ఇవన్నీ కలిసి మార్కెట్ విలువ ప్రకారం 250 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. ఈ కేసులో... బాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. బ్యాంకు లాకర్లలో 18 తులాల బంగారం, పాస్ బుక్‌లను కూడా గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడులపై కూడా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు.