Arvind Kejriwal Ayodhya Visit: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ కూడా కేజ్రీవాల్‌తో కలిసి రాముడి దర్శనం చేసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నెల జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆ ఉత్సవానికి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆహ్వానించలేదు ట్రస్ట్. ఆ సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆహ్వానం అందకపోయినా కుటుంబ సభ్యులతో సహా వెళ్లి రాముడి దర్శించుకుంటానని స్పష్టంచేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యను సందర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలూ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 






క్యూ కడుతున్న భక్తులు..


అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరడంతో 5 శతాబ్ధాల కల నెరవేరింది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం అభిజీత్ లగ్నంలో బాలరాముడి విగ్రహానికి అయోధ్య ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట చేయడం తెలిసిందే. జన్మభూమిలో రామయ్య కొలువుతీరాడని, అయోధ్య రాముడి దర్శనాలు జనవరి 23న ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో సహచర మంత్రులకు ప్రధాని మోదీ ఓ సలహా ఇచ్చారు. అయోధ్యలో రాముడి దర్శనానికి ఇప్పట్లో వెళ్లకూడదని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అందుకు గల కారణం సైతం వెల్లడైంది. సామాన్య భక్తులు అయోధ్య రామాలయానికి భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని.. ఈ టైమ్‌లో కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని తెలుస్తోంది.


మంత్రులకు మోదీ సూచన..


సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి నెల పూర్తయ్యే వరకు అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవాలని.. మార్చి నెల నుంచి రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని, ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.  సామాన్య భక్తులకు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని మోదీ భావించారని తెలుస్తోంది. ప్రధాని నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: PM Modi MP Visit: ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, 370 సీట్లు మావే - ప్రధాని మోదీ ధీమా