PM Modi MP Visit: ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. జబువా జిల్లాలో రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు పర్యటించడం కీలకంగా మారింది. అంతే కాదు. గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు మోదీ. ఈ క్రమంలోనే బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజీపీయే గెలుస్తుందని తేల్చి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (Phir Ek Baar Modi Sarkar) అంటూ నినదించారు. బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని, బీజేపీ కూటమి మొత్తంగా 400 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఏ అభివృద్ధి కనిపించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని మండి పడ్డారు. ఇప్పుడా రోజులు పోయాయని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, ఇకపై అన్ని సమస్యలు తీరిపోతాయని భరోసా ఇచ్చారు. 


"మధ్యప్రదేశ్‌లో ఎన్నో కీలక ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఇలానే అభివృద్ధి చెందుతుంది. నేను మధ్యప్రదేశ్‌లో పర్యటించడాన్నీ కొందరు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల కోసమే వచ్చానని ఆరోపిస్తున్నారు. కానీ...ఎన్నికలతో సంబంధం లేని పర్యటన. ప్రచారం చేసుకోడానికి రాలేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను"


- ప్రధాని నరేంద్ర మోదీ


 






తమ ప్రభుత్వం గిరిజనులను కేవలం ఓటు బ్యాంకులా ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. వాళ్లే మన దేశం గౌరవం అని తెలిపారు. ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి మంచి చేసే అవకాశమున్నా చేయలేకపోయిందని మండి పడ్డారు. ఈ పదేళ్లలోనే తమప్రభుత్వం ఎంతో చేసి చూపించిందని వెల్లడించారు. గిరిజన విద్యార్థులు చదువుల్లో వెనకబడ కూడదన్న ఉద్దేశంతోనే ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గిరిజనులు సికిల్ సెల్‌ తో బాధ పడుతుంటే కాంగ్రెస్ పట్టించుకోలేదని, చాలా మంది ప్రాణాలు కోల్పోయినా ఏ మాత్రం చలించలేదని విమర్శించారు.