Telangana Government Massive Transfer of Mpdos: రాష్ట్రంలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. తాజాగా, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలకు స్థానచలనం కలిగించింది. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని డిసెంబర్ లో ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శనివారం రెవెన్యూ శాఖలో తహసీల్దార్లను, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. కాగా, ఇతర శాఖల్లోనూ త్వరలోనే బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
132 మంది ఎమ్మార్వోల బదిలీ
శనివారం రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 11 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా సర్కారు పెండింగ్ లో ఉంచింది. అయితే, కొంతకాలంగా వెయిటింగ్ లో ఉన్న 13 మందికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చింది. మల్టి జోన్ - 1లో 69 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ ఏడాది జూన్ 30 తర్వాత రిటైర్ కాబోతున్న మరో 15 మంది తహసీల్దార్లకు సూపరింటెండెంట్/డీఏవోలుగా పదోన్నతి కల్పిస్తూ ట్రాన్స్ ఫర్ చేసింది. మల్టి జోన్ - 2 లో మొత్తం 43 మంది ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పించింది. త్వరలో రిటైర్ కాబోతున్న మరో ఐదుగురికి పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చింది.
వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ
మరోవైపు, రాష్ట్రంలో గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల (VRA) వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్ఏల సర్వీసుల పునరుద్ధరణ, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని శనివారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను కమిటీలో సభ్యులుగా నియమించారు. వీఆర్ఏలకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని అన్నారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, చట్ట పరిమితి, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, న్యాయ వివాదాలు, ఇతర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
Also Read: Tatikonda Rajaiah: ప్రశ్నార్థకంగా రాజయ్య పొలిటికల్ ఫ్యూచర్! మాజీ డిప్యూటీ సీఎంకు అన్నీ అడ్డంకులే!