Minister Komatireddy Comments on Ex CM Kcr: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) మండిపడ్డారు. నల్గొండలో (Nalgonda) ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని.. జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న బీఆర్ఎస్ సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ప్రసంగం ప్రారంభించాలని అన్నారు.


ఆ రోజు నిరసన


కాగా, కృష్ణా జలాల పరిరక్షణే ధ్యేయమని ఈ నెల 13న బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సభా నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. 'దక్షిణ తెలంగాణను ఎడారి చేసింది కేసీఆర్. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్, హరీష్ రావుకు లేదు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నీటి కేటాయింపులకు అంగీకరించింది ఎవరు?. నల్గొండను నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వానిదే. ప్రజలు కేసీఆర్ మోసాన్ని గుర్తించారు కాబట్టి ఎన్నికల్లో ఓడగొట్టారు. ఆ తీర్పు చూసి కూడా ఏ ముఖం పెట్టుకుని సభకు వస్తారు.?' అని నిలదీశారు. ఈ నెల 13న నల్గొండ పట్టణంలోని చౌరస్తాల్లో కుర్చీపై పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెట్టి, ఎల్ఈడీ స్క్రీన్ సైతం ఏర్పాటు చేసి రైతులతో వినూత్న నిరసన చేపడతామని వెల్లడించారు.


బడ్జెట్ పై మంత్రి స్పందన


అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 'కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చాం. విద్యా రంగానికి అధికంగా, ప్రతీ గ్రామానికి రోడ్లు వేసేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకు సమతుల ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయింపులు జరిగాయి. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే మేము కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్ కానుంది. బడ్జెట్ పై విమర్శలు చేసే వారు మూర్ఖులు.' అంటూ మంత్రి మండిపడ్డారు.


Also Read: Balka Suman: బాల్క సుమన్‌కు నోటీసులు, సీఎం రేవంత్‌ను తిట్టిన కేసులో ఇచ్చిన పోలీసులు