Trans : మతం మనిషిని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. మత బోధనలు మెదడుపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో అంచనా వేయడం కష్టం. చివరికి చని పోయిన వాళ్లనూ బతికిస్తారని మత ప్రబోధకులు చెప్పే మాటలూ వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. మలయాళంలో వచ్చిన ట్రాన్స్ అనే సినిమలో తన బిడ్డ అనారోగ్యానికి గురైతే.. ఆస్పత్రి అవసరం లేదని.. చనిపోయినా మత ప్రబోధకుడు బతికిస్తాడని ఓ తండ్రి నమ్మకంతో ఉంటాడు. చివరికి కుమార్తెను పోగొట్టుకుంటాడు. అలాంటి ఘటనే మంచిర్యాలలో చోటు చేసుకుంది.
తల్లి శవంతో బెల్లంపల్లి కల్వరి టెంపుల్ వద్దకు వచ్చిన వ్యక్తి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కల్వరి టెంపుల్ పేరుతో ఓ చర్చి ఉంది. ఆ చర్చి నిర్వాహకుడు యూట్యూబ్ లో బోధనలు చెబుతూ ఉంటారు. శుక్రవారం ఉదయం.. రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి అంబులెన్స్‌లో తన తల్లి శవాన్ని పెట్టుకుని చర్చి వద్దకు వచ్చారు. పాస్టర్ బతికిస్తారని.. ప్రార్థనలు చేయించాలని పట్టుబట్టారు. అయితే ఆ చర్చి సిబ్బంది లోపలికి వెళ్లనీయలేదు. ఆ పాస్టర్ కూడా బయటకు రాలేదు.
పాస్టర్ టచ్ చేస్తే తన తల్లి బ్రతుకుతుందని నమ్మకం
ఆయన టచ్ చేస్తే చాలు... మా అమ్మగారు బతుకుతారు.. కానీ ఆయన దొరకడం లేదు.. టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం.. ఆయన మహిమలకు కొదవ లేదు.. ఈ పాస్టర్ నిజమైన దైవభక్తుడు అందుకే ఆయనంటే నమ్మకం.. ఇదీ తన తల్లి శవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ధీమా.. నమ్మకం. ఆయన నమ్మకం ఎక్కడి వరకు వెళ్లిదంటే పాస్టర్ చేయి పడితే చనిపోయిన తన తల్లి కూడా లేచి వస్తుందని అందుకే శవాన్ని సైతం తీసుకువచ్చాడు..
రాజమండ్రికి చెందిన వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి తల్లి మణికుమారి అనారోగ్యంతో మరణించారు. ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌కు భక్తుడు. ఇక్కడి కల్వరి చర్చ్ ప్రవీణ్ ప్రార్ధనలు టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూసి ఆయన మహిమల పట్ల ఆకర్షితుడయ్యాడు. అపారమైన నమ్మకం పెంచుకున్నాడు. ఆయన తల్లి మణికుమారి అనారోగ్యానికి గురి కాగా, హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వైద్యం కొసం తీసుకువచ్చాడు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స పొందినా ఫలితం లేదని ఆమెను బెల్లంపల్లికి తీసుకువచ్చేందుకు సన్నద్దమయ్యాడు. గురువారం మణికుమారి చనిపోయింది. అయినా సరే, పాస్టర్ ప్రవీణ్ చేయి తాకితే తిరిగి ఆమె బతుకుతుందనే ఉద్దేశంతో శవాన్ని బెల్లంపల్లికి తీసుకువచ్చాడు. అయితే అక్కడి నిర్వాహకులు అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన చర్చి గేటు వద్దే చాలా సేపు నిరీక్షించారు. విషయం మీడియాకు తెలియడంతో అక్కడకు వెళ్లింది.
ఇంజినీరింగ్ చదువుకున్న వ్యక్తి
పాస్టర్ ప్రవీణ్‌కుమార్ గొప్ప వ్యక్తి అని ఆయన టచ్ చేస్తే చాలు తన తల్లి లేచి కూర్చుకుంటదని వెల్లడించాడు. ఆయన మహిళలు ఎన్నో టీవీల్లో ప్రత్యక్షప్రసారాల ద్వారా చూశానని అందుకే నమ్మకంతో తీసుకువచ్చానని చెప్పాడు. అయితే, తల్లి పేరు మణికుమారి అని చెప్పిన ఆ వ్యక్తి తన పేరు మాత్రం వెల్లడించలేదు. విషయం పోలీసుల వరకు చేరడంతో వారు అతన్ని అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. ఇంతా చేసి ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చేసిన వాడిగా గుర్తించారు. అంత చదువకుని మూఢనమ్మకాలతో శవాన్ని తీసుకువచ్చి తిరిగి బతుకుతుందని చెప్పడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.