Cooling Towers Dismatled In Palwancha KTPS: విద్యుత్ కర్మాగారంలో కాలం చెల్లిన కూలింగ్ టవర్స్‌ను అధికారులు కూల్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం కర్మాగారంలో 8 టవర్ల ప్రస్థానం ముగియగా వాటిని అధునాతన టెక్నాలజీ సాయంతో నేలమట్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి విద్యుత్ వెలుగులు అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) లో కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు భావించారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న ఈ కర్మాగారం మూతపడింది. దీంతో 2023, జనవరి 18 నుంచి కర్మాగారానికి సంబంధించి టవర్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. 


3 దశల్లో ప్రక్రియ



టవర్ల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి, అందులోని మెటీరియల్ తీసుకునే విధంగా హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ రూ.465 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ట్రాన్స్ కో, జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత టవర్లను కూల్చేశారు. దాదాపు 30 మంది సిబ్బంది సుమారు నెల రోజులు ఈ కూల్చివేత సన్నాహాలు చేశారు. 3 దశల్లో ఈ ప్రక్రియ సాగింది. తొలుత 'ఎ' స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన 4 కూలింగ్ టవర్లను కూల్చివేయగా.. అనంతరం 115 మీటర్ల ఎత్తుగల 4 టవర్లను 2 దశల్లో నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్ అనే పేలుడు పదార్థాన్ని కూల్చివేత కోసం వినియోగించారు. టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేసిన అనంతరం కేటీపీఎస్‌కు ఉపయోగపడనుంది. 1965 - 67 నుంచి 78 వరకూ దశలవారీగా నిర్మించిన ఏ, బీ, సీ పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం ఈ కూలింగ్ టవర్స్ నిర్మించారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో 2 గంటలపాటు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు.


Also Read: Mulugu News: సీపీఆర్ చేసి ఊపిరి పోసిన కానిస్టేబుల్స్ - బలమైన గాయం ప్రాణం తీసింది