Plane Emergency Landing Due Lice On Woman Hair: సాధారణంగా విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన సందర్భంలోనో, లేకుంటే ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైన సమయంలోనో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడం చూశాం. అయితే, విచిత్రంగా ఓ మహిళ తలలో పాకుతున్న పేనుల కారమంగా ఓ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ (American Airlines) విమానంలో ఈ ఘటన జూన్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఈ సంఘటన వెలుగుచూసింది.
సదరు ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు విమానం లాస్ ఏంజెల్స్ (Losangeles) నుంచి న్యూయార్క్ (Newyork) వెళ్తోంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ తలలో పేలు పాకడాన్ని తోటి ప్రయాణికులు గమనించారు. దీనిపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. విమానాన్ని ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 'విమానాన్ని మళ్లిస్తున్నట్లు మాత్రమే సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, ఎవరూ భయపడడం లేదు. కొద్దిసేపటి తర్వాత విమానం ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందువైపునకు వెళ్లింది. అసలు విమానం ఎందుకు ల్యాండ్ అయ్యిందని నేను తోటి ప్రయాణికున్ని అడిగితే అసలు విషయం తెలిసింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి చెప్పారట. అనంతరం వారు వచ్చి చూసి ఆమె తలలో పేలు పాకుతుండడాన్ని చూసి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.' అని వివరించారు. దీని కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైందని.. అయితే, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రయాణికుడు వివరించారు.