Pawan Kalyan Speech At Collectors Meeting: పాలన ఎలా ఉండాలో గతంలో ఏపీ పాఠాలు నేర్పేది... అసలు పాలన ఎలా ఉండకూడదో గుణపాఠాలు నేర్పింది గత ఐదేళ్ల పాలన అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఆలోచనలను అధికారులకు వివరించారు. ఐదేళ్లుగా చాలా అవమానాలు భరించి అనేక ఒత్తిళ్లు తట్టుకొని అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజాసేవలపై  ఎంతో కమిట్‌మెంట్ ఉన్నందునే అన్నీ దిగమింగి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. అందుకే ఐదేళ్లు కూడా అంతకు మించిన డెడికేషన్‌తో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. దీన్ని గ్రహించిన అధికారులు తమ సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు పవన్. 


ఇదే మా ప్రణాళిక


వ్యవస్థలను బతికించాలని కలెక్టర్లకు పవన్ సూచించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం మీ వెనుకాల మేం ఉన్నామని భరోసా ఇచ్చారు. మోడల్ స్టేట్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని దాన్ని పూర్తిగా పునర్‌నిర్మించాలని అభిప్రాయపడ్డారు. తన శాఖకు సంబంధించిన లక్ష్యాలను అధికారుల ముందు పవన్ ఉంచారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద బృహత్ కార్యక్రమం అన్నారు. వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని సూచించారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు పవన్ కల్యాణ్. తమ పాలన కూడా ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతామన్నారు. 


ఆ దుస్థితి మరోసారి రాకూడదు


వ్యవస్థలను ఆటబొమ్మలుగా చేసుకొని రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని వైసీపీ పాలనపై విమర్శలు చేశారు పవన్. పాలన ఎలా ఉండకూడదో చూపించారని అన్నారు. ఇది తన మొదటి సమావేశమనని ఇంకా తాను కూడా చాలా నేర్చుకుంటున్నానని అన్నారు. ఈ క్రమంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే కచ్చితంగా తమకు తెలియజేయాలని చంద్రబాబును కోరారు పవన్ కల్యాణ్. మంత్రులు, అధికారుల తప్పుల వల్ల ప్రభుత్వం ఇరుకునే పడే పరిస్థితి, మందుకు వెళ్లలేని దుస్థితి రాకూడదని ఆకాంక్షించారు పవన్. 


చంద్రబాబు నాయకత్వంలో వృద్ధి పథంలో...


ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలు దేశ సమగ్రతపై ప్రభావం చూపబోతున్నాయని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్. విభజనతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గత ఐదేళ్ల పాలన మరింత ఆగ్రహాన్ని తెప్పించిదన్నారు. అందుకే ఇకపై వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అనుభవం కూటమి లక్ష్య సాధనకు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు.  


Also Read: సింపుల్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఉండాలి- అందరి పనితీరుపై మూడు నెలలకోసారి రివ్యూ: చంద్రబాబు


Also Read: నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు - వడివడిగా కృష్ణమ్మ పరుగులు