Nagarjuna Sagar Dam Crust Gates Lifted: ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తిన క్రమంలో అధికారులు సోమవారం 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరెన్ మోగించారు. అనంతరం ఒక్కో గేటును ఎత్తి ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి దాదాపు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా బట్టి గేట్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 582.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 3,23,748 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.