Chandra Babu: కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu)...ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించనున్నారు. ఇప్పటికే అధికారుల బదిలీలు పూర్తిస్థాయిలో చేపట్టిన సీఎం...రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వారి ముందు ఉంచనున్నారు
నేడు కలెక్టర్ల సదస్సు
వైసీపీ(YCP) హయాంలో జరిగిన అక్రమాలు, సహజ వనరుల దోపిడీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం వాటిని వెలికితీసి చట్టపరంగానే వారిపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే నేడు కలెక్టర్ల సదస్సులోనూ నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, YSR, అన్నమయ్య, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా వీటిల్లో జరిగిన అక్రమాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు నేడు జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే వ్యవసాయ భూముల కన్వర్షన్ బాధ్యతలు సైతం కలెక్టర్లకు అప్పగించనున్నారు. అలాగే మదనపల్లె సబ్‌కలెక్టర్ దహానం కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అప్పుడే పెట్టుబడిదారులు పరుగులు తీస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్లకు నిర్దేశించనున్నారు.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టనుంది. ఆయా ప్రాంతాల్లో ఆధార్(Aadhar), రేషన్ కార్డు(Ration Card)లు,ఇల్లు, తాగునీటి వసతులు, రహదారులు సహా అన్ని అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఈనెల 7 నుంచి 20 వరకు సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది.
మహిళలకు చేయూత
మహిళా సంఘాలను ఆర్థికంగా ఆదుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ...డ్వాక్రాసంఘాలకు ఈ-సైకిళ్లు అందించాలని నిర్ణయించింది.ముందుగా కుప్పం నియోజకవర్గంలో 300 మంది మహిళలకు 45 వేలు విలువ చేసే సైకిల్‌ను 9వేలకే అందిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి
సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం...భారీ ప్రాజెక్ట్‌లే గాక చిన్నతరహా ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించనుంది. అలాగే ఏడున్నర లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని యోచిస్తోంది. డిజిటల్ విధానంలో పౌరసేవలు అందించేందుకు పీపీపీ విధానంలో ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకురానుంది. గత ఐదేళ్లలో పాడైపోయిన రహదారుల మరమ్మతులు సైతం వెంటనే చేపట్టాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించనున్నారు. రాజధాని ప్రాంతాలంలో ఇంకా సేకరించాల్సిన భూమిపైనా కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు.
సచివాలయంలో సదస్సు
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసం వద్ద ఉన్న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు జరిగేది. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో ఇప్పుడు సచివాలయంలోనే కలెక్టర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం పదిగంటలకు సదస్సు ప్రారంభం కానుంది. చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం విజన్ ఆంధ్ర-2047పై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం మరికొన్ని శాఖలపై చర్చిస్తారు.