Chandra Babu And Pawan Kalyan Participated In Collectors Meeting: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా యంత్రాంగంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో చాలా సార్లు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేశాం కానీ ఇది చాలా ప్రత్యేకమన్నారు సీఎం. ఈ భేటీ చరిత్రనే తిరగరాసేది అవుతుందని అన్నారు. ఐదేళ్ల పాటు పూర్తిగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అందరూ ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని సూచించారు. అందుకే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలని అన్నారు. 


లక్ష్లాలు స్పష్టంగా ఉన్నాయి


ప్రభుత్వం చాలా స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోందని అందుకు తగ్గట్టుగానే బ్యూరోక్రసీ పనితీరు మార్చుకోవాలని సూచించారు. తనతోపాటు కింది స్థాయి అధికారి వరకు అందరూ ఏరోజుకారోజు పని తీరును రివ్యూ చేసుకోవాలని సూచించారు. సీఎంవో పని తీరును కూడా ప్రతి శనివారం రివ్యూ చేసుకుంటామని ఆ వారంలో ఏం పనులు చేశాం, ప్రజలకు ఎంత వరకు అందుబాటులో ఉన్నామనే విషయాన్ని బేరీజు వేసుకుంటామన్నారు. మూడు నెలలకోసారి తనతోపాటు అందరి పని తీరుపై కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు 


హడావుడి వద్దు


ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన తాము డిక్టేటర్స్‌ కాదని.. ప్రజా సేవకులమనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు చంద్రబాబు. గవర్నెన్స్‌ చాలా సింపుల్‌గా ఉండాలని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటేలా చూడాలన్నారు. తన పర్యటనలో కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రజలను తరలించే పరిస్థితి రాకూడదని వివరించారు. గతంలో మాదిరిగా పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం లాంటివి అసలే వద్దని సూచించారు. తాను వచ్చినప్పుడు కూడా ప్రజలను ఆపి ఇబ్బంది పెట్టొద్దని తెలియజేశారు. 


మాట తీరు జాగ్రత్త


అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతలి వాళ్లను కించపరచొద్దన్నారు సీఎం. ప్రజలతో మాట్లాడే సందర్భంగా చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. వ్యవస్థల్లో ఉన్న ‌వ్యక్తులు తప్పులు చేస్తే అది తనపై రిఫ్లెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పనుల విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారుల వద్దకు వస్తే ఓపికతో సమాధానాలు చెప్పాలని పనులు చేసే వీలు లేకుంటే ఎందుకు చేయడం లేదో చెప్పాలని సూచించారు. అంతే కానీ తప్పులు చేయమని మాత్రం ప్రోత్సహించినట్టు కాదన్నారు. 


వాళ్ల భవిష్యత్ మీ చేతుల్లోనే 


లక్షల మందికి రిప్రజెంట్ చేసే నేతలు వచ్చినప్పుడు వారి సమస్యలు విని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు చంద్రబాబు. వాళ్లు ఐదేళ్లకోసారి పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అందుకే ప్రజా సమస్యలు టైంబౌండ్‌ ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. వాళ్ల భవిష్యత్‌ అధికారుల పనితీరుపై ఆధారపడి ఉంటాయని వివరించారు. పనులు పూర్తైన తర్వాత అధికారులకు సంతృప్తి వస్తుందని పనుల క్రెడిట్ మాత్రం సదరు ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని సూచించారు. అధికారులు రిటైర్‌ అయ్యే వరకు ఉద్యోగాల్లో ఉంటారు కానీ.... ప్రజా ప్రతనిధుల కాలపరిమితి ఐదేళ్లే అన్నారు. ఆ ఐదేళ్ల తర్వాత ప్రజల మనసులు గెలిస్తే వస్తారని లేకుంటే అసెంబ్లీలో కూడా అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్నారు. అందుకే ఈ విషయంలో మాత్రం కోఆర్డినేషన్‌తో పనిచేయాలన్నారు.