GST Council Meet:  చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకుంది. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలని, సీజీఎస్టీ చట్టంలో సవరణలకు సైతం జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదనలు చేసింది. అయితే వచ్చే ఏడాది మార్చిలోగా ట్యాక్స్ చెల్లించే వారికి పన్ను మినహాయింపులు ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ కట్టేందుకు గడువు పొడిగించడంతో వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం కలుగుతుంది. అక్రమాలు జరగకుండా చూసేందుకు ఆధార్‌ అథెంటిఫికేషన్‌ తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు.


కొత్త ప్రభుత్వంలో తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశ నిర్ణయాలు వెల్లడించారు. భారతీయ రైల్వేలు అందించే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, బ్యాటరీ కార్ సర్వీస్ వంటి సేవలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే రానున్న రోజుల్లో రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, ఇతర సర్వీసులు చౌకగా మారనున్నాయి.  జీఎస్టీ కౌన్సిల్ అన్ని పాల డబ్బాలపై 12 శాతం యూనిఫాం రేటును సిఫార్సు చేసింది. 


జీఎస్టీ పరిధి నుంచి ఎరువులు మినహాయింపు
ఎరువుల రంగాన్ని ప్రస్తుత ఐదు శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందానికి సిఫార్సు చేసినట్లు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం తెలిపారు. ఇప్పుడు కౌన్సిల్ ఈ అంశాన్ని పరిశీలించనుంది. ఎరువుల తయారీ కంపెనీలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా పోషకాలు, ముడిసరుకులపై జీఎస్టీని తగ్గించడంపై కౌన్సిల్ చర్చించింది. ఫిబ్రవరిలో రసాయనాలు, ఎరువుల స్టాండింగ్ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది.


పాఠశాలల నిర్మాణం పై జీఎస్టీ తగ్గింపు
కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి  మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్టీని మినహాయించాలని కోరారు. ఇటువంటి మినహాయింపులు రాష్ట్రాలు అదనపు పాఠశాలలను నిర్మించడానికి మరిన్ని వనరులను సమకూర్చుకోగలవని తెలిపారు. విద్యపై ప్రతి పౌరుని ప్రాథమిక హక్కును బలోపేతం చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన సమావేశంలో నొక్కి చెప్పారు.  అలాగే ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ENA)ని జీఎస్టీ పరిధి నుండి మినహాయించాలని భట్టి విక్రమార్క సమావేశంలో సూచించారు. ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జిఎస్‌టి కింద చేర్చడం వల్ల రాష్ట్రాల ఆర్థిక సౌలభ్యం తగ్గుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వస్తువులపై పన్ను భారం పెరుగుతుందని ఆయన వాదించారు. అందువల్ల సమావేశానికి హాజరైన వారు ఈఎన్ఏకు  సంబంధించిన చట్ట సవరణ ప్రతిపాదనకు మద్దతు పలికారు.
 
సర్ ఛార్జ్ పది శాతం మించొద్దు
 కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రానికి కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కోరామని భట్టి విక్రమార్క తెలిపారు.  అలాగే ‘స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలని కోరామన్నారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలన్నారు. వాటిని తగ్గించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలని సూచించినట్లు తెలిపారు.  సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చూడాలన్నారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు రూ.2250 కోట్ల పెండింగ్ నిధులున్నాయని భట్టి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు.