24 Petitions on Challenging the Election of Mlas: గత నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 24 మంది అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్లు దాఖలయ్యాయి. వారి ఎన్నిక చెల్లదని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. తమను ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని మరికొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (HarishRao) ఎన్నికను సైతం సవాల్ చేశారు. అయితే, నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపే ఆ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పిటిషన్లన్నీ ఇంకా స్క్రూట్నీ దశలోనే ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉంటే త్వరలోనే హైకోర్టు రిజిస్ట్రీ వీటికి నెంబర్లు కేటాయించనుంది.
'కేటీఆర్ పూర్తి సమాచారం ఇవ్వలేదు'
2023 శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ తరఫున సిరిసిల్ల నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున మహేందర్ రెడ్డి పోటీ చేశారు. కేటీఆర్ కు 89,224 ఓట్లు రాగా, మహేందర్ రెడ్డికి 59,557 ఓట్లు వచ్చాయి. అయితే, కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి సమాచారం ఇవ్వలేదని.. ఆయన ఎన్నిక చెల్లదని మహేందర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. తన కుమారుడు హిమాన్షు పేరుతో ఉన్న 32 ఎకరాల భూమి వివరాలు వెల్లడించలేదని ఫిర్యాదు చేశారు. ఈ భూమి సేల్ డీడ్ ను సైతం మహేందర్ రెడ్డి సమర్పించారు. అలాగే, అమెరికా వర్శిటీలో చదువుతున్న కుమారుడికి కేటీఆరే ఫీజు కడుతున్నా డిపెండెంట్ గా చూపలేదని అన్నారు. అలాగే, వీవీ ప్యాట్లను మరోసారి లెక్కించేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశాలివ్వాలని కోరారు. కేటీఆర్ ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ తన కొడుకు ఆస్తులు చూపలేదని మరో పిటిషన్ సైతం దాఖలైంది.
'హరీష్ అఫిడవిట్ లోనూ తప్పులు'
అటు, సిద్ధిపేటలో బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, కాంగ్రెస్ తరఫున హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. హరీశ్ రావుకు 1,05,514 ఓట్లు రాగా హరికృష్ణకు 23,206 ఓట్లు, చక్రధర్ కు 16,610 ఓట్లు వచ్చాయి. అయితే, హరీశ్ రావు అఫిడవిట్ లో పూర్తి సమాచారం వెల్లడించకుండా దాచిపెట్టారని, తన కుమారుడి వివరాలు పేర్కొనలేదని చక్రధర్ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో 36 కేసులుండగా, 2023లో 3 కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారని.. మిగిలిన కేసుల గురించి ప్రస్తావించలేదని అన్నారు. హరీశ్ రావు ఎన్నికను రద్దు చేయాలని కోరారు.
మరికొన్ని పిటిషన్లు
హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి విజయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత ఈటల రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విజయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత అజారుద్దీన్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు ఎన్నికపై కాంగ్రెస్ నేత బండి రమేశ్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే, ఆసిఫాబాద్, గద్వాల, పటాన్ చెరు, కామారెడ్డి, షాద్ నగర్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ లో అవకతవకలు ఉన్నాయని, సరైన వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ లను మళ్లీ లెక్కించాలని కోరారు. మరోవైపు, నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల కమిషన్ తన విధులు సక్రమంగా నిర్వహించలేదని పిటిషన్ వేశారు.
2018 పిటిషన్లే పెండింగ్
అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లే ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అప్పటి ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం, గద్వాల ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పులు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.