Telangana News: తొలిసారి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రేవంత్ రెడ్డి‍(Revanth Reddy) ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చేనెల రెండోవారంలో సమావేశాలు నిర్వహణకు కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున  ఈసారి కేంద్ర ప్రభుత్వం సైతం ఓట్ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ాష్ట్రాలకు ఇచ్చే నిధులపై స్పష్టత ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా అన్న దానిపై తర్జన భర్జన జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌ను అనుసరించి ప్రణాళికల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులు ఆదేశించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగనుంది.


బడ్జెట్‌ కూర్పుపై విస్తృత కసరత్తు 


కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల(Six Guarantees ) అమలు సహా... కాళేశ్వరం(Kaleswaram Projects)లో అవినీతి, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై బడ్జెట్‌ సమావేశాల్లో పూర్తి స్థాయి చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితేనే కూలంకూషంగా చర్చించేందుకు సుమారు రెండు వారాలపాటు సమావేశాలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే బడ్డెట్‌ సమావేశాలు 4-5 రోజులకే పరిమితం చేయాల్సి ఉంటుంది. అయితే సారి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలతో బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Batti Vikramarka) న్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.


కల గణనపై ఫోకస్ 


రాష్ట్రంలో బీసీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కులగణనపైనా ఈ బడ్జెట్‌ సమావేశాలల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ సైతం కులగణన కచ్చితంగా జరిపి తీరుతామని హామీ ఇచ్చారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహూల్‍ (Rahul Gandhi) సైతం న్యాయ్‌ యాత్రలో పదేపదే కులగణనపై ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో  రాష్ట్రంలో కులగణనను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) ఈ బిల్లు ముసాయిదా తయారీపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. బిహార్‌ ( Bihar), కర్ణాటక (Karnataka) లోనూ కులగణన ఇప్పటికే పూర్తయ్యింది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక అధికారుల బృందం వెళ్లి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని... మేలైన పద్దతులను అనుసరించి రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ప్రత్యేక అధికారుల బృందం... బిహార్, కర్ణాటకలో పర్యటించి కులగణనపై అధ్యయనం చేయనుంది.


కులగణన విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని, పారదర్శకంగా కులగణను ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించించారు.దాదాపు వందేళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కులగణన చేపట్టగా...ఇప్పటి వరకు దేశంలో కులగణన చేయలేదు. బీసీ కులగణన చేపట్టాలని..అందుకు అనుగుణంగానే రాజకీయ,ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆయా సామాజిక వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ కులగణన అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్న రాజకీయ పార్టీలు...అధికారంలోకి వచ్చిన తర్వాత దాటవేత ధోరణి అవలంభిస్తున్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ మాత్రం కులగణనపై పట్టుదలతో ఉంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ పదేపదే కులగణన చేపట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి పూర్తిస్థాయిలో కులగణన చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.