Students Joined Where The Teacher Transfer In Jannaram In Mancherial: విద్యార్థులకు బాగా చదువు చెప్పిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైనా బదిలీపై వెళ్లిపోతుంటే 'వెళ్లొద్దు సార్' అంటూ ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చూశాం. ఆ టీచర్‌ను కన్నీటితో సాగనంపడమూ చూశాం. కానీ ఇక్కడ తమ భవితను తీర్చిదిద్ది తమ గురించి నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థులు వదులుకోలేకపోయారు. ఆ టీచర్ బదిలీ అయిన స్కూల్లోనే వారంతా చేరిపోయారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 141 మంది విద్యార్థులు ఒకే పాఠశాలలో చేరిపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.


ఆ టీచర్ విజయ గాథ


మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో 2012, జులై 13న ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ చేరారు. అప్పుడు అక్కడ 5 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. శ్రీనివాస్ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆట పాటలతో పాఠాలు బోధిస్తూ, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంకితభావం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో తోటి ఉపాధ్యాయులతో కలిసి మంచి ఫలితాలు తీసుకొచ్చారు. గురుకుల, నవోదయ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తూనే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అనతికాలంలోనే విద్యార్థుల సంఖ్య 252కు చేరింది. గత ఐదేళ్లుగా జూన్ చివరిలోనే ఆ పాఠశాలలో 'నో అడ్మిషన్' బోర్డు తగిలిస్తున్నారు. పొనకల్‌లో ఉన్న పాఠశాలకు మండలంలోని సుమారు 10 గ్రామాల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఆటోలో పంపించేవారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ఈ పాఠశాల నుంచే గురుకుల, నవోదయ పరీక్షల్లో ఎక్కువగా విద్యార్థులు ఎంపికవుతున్నారు. శ్రీనివాస్ వారికి అత్యుత్తమ బోధన అందించడమే కాకుండా తోటి ఉపాధ్యాయులతో కలిసి అంకితభావంతో జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


టీచర్ వెంటే విద్యార్థులు


ఇటీవల ఎస్జీటీలను ప్రభుత్వం బదిలీ చేయగా.. జాజాల శ్రీనివాస్ జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాలకు ఈ నెల 1న బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికే వెళ్తామని పట్టుబట్టడంతో తల్లిదండ్రులు కూడా ఆయనపై నమ్మకంతో తమ పిల్లలను ఆ పాఠశాలలోనే చేర్పించారు. ఇప్పటివరకు 11 మంది ఉన్న అక్కపెల్లిగూడ పాఠశాలలో 141 మంది చేరారు. దీంతో 152 మంది విద్యార్థులతో ఆ పాఠశాల కళకళలాడుతోంది. టీజీపల్లి, దేవునిగూడ, కామన్పల్లి, కిష్టాపూర్, ఇందన్ పల్లి, గాంధీనగర్, జువ్విగూడ, జన్నారం గ్రామాల నుంచి విధ్యార్థులు ఆటోల్లో పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.


ఆ టీచర్ ఏన్నారంటే.?


'ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నా విధులు సక్రమంగా నిర్వర్తించాను. విద్యార్థులకు బోధన సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో నా తోటి ఉపాధ్యాయులతో కలిసి కష్టపడ్డాను. మంచి ఫలితాలు వచ్చాయి. నాపై, సిబ్బందిపై నమ్మకంతో వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపారు. ఈ నెల 1న బదిలీపై అక్కపెల్లిగూడ పాఠశాలకు వెళ్లాను. బదిలీ విషయం తెలుసుకుని 141 మంది విద్యార్థులు కూడా నా పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఫలితాలు తీసుకువస్తాను'  ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్ చెబుతున్నారు.