యూట్యూబ్ వీడియోలు చూసే వారికి యాడ్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. చాలా ఆసక్తిగా చూస్తున్న సమయంలో యాడ్స్ రావడంతో వినియోగదారులకు చిరాకు కలుగుతుంది. ఇక ఓవర్ లే యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో వీడియోపై చాలా సార్లు ఇవి కనిపిస్తాయి. పరమ చిరాకు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఓవర్ లే యాడ్స్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.


ఏప్రిల్ 6 నుంచి యూట్యూబ్ వీడియోలలో ఓవర్ లే యాడ్స్ కనిపించవని గూగుల్ యాజమాన్యంలోని సంస్థ ప్రకటించింది. వీక్షకులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. డెస్క్ టాప్ తో పాటు మొబైల్ పరికారాల్లో హయ్యర్ ఫర్మార్మింగ్ ప్రకటనల ఎంగేజ్‌మెంట్ మార్చాలనుకుంటున్నట్లు తెలిపింది. ఓవర్ లే యాడ్స్ డెస్క్ టాప్ లో మాత్రమే అందించబడే లెగసీ యాడ్ ఫార్మాట్. ఇవి వీక్షకులకు బాగా అంతరాయం కలిగిస్తాయి.  


యూట్యూబ్ కొత్త నిర్ణయంతో ఏం జరగబోతోంది?    


ఏప్రిల్ 6 నుంచి,  యూట్యూబ్  స్టూడియోలో ప్రకటనలను ఆన్ చేసినప్పుడు ఓవర్ లే యాడ్స్ అనేవి కనిపించవు. ఈ ప్రకటలను నిలిపివేయడం వలన ఇతర ఫార్మట్లలోని యాడ్స్ మాత్రమే కనిపిస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే, ఓవర్ లే యాడ్స్ మినహా మిగతా ఫార్మాట్ లోని ప్రకటనల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిపింది.    


యూట్యూబ్ ఓవర్ లే యాడ్స్ అంటే ఏంటి?   


యూట్యూబ్ ఇన్-వీడియో ఓవర్‌ లే యాడ్స్ వీడియో దిగువన కనిపిస్తాయి.  వినియోగదారులకు పాప్-అప్ కార్డ్‌లు గా కనిపిస్తాయి. ఈ ప్రకటనలు సాధారణ టెక్ట్స్ లేదంటే చిత్రాలుగా కనిపిస్తాయి. యాడ్ పైన ఉన్న 'x' చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ యాడ్ ను తీసివేసే అవకాశం ఉంటుంది.  వినియోగదారుడు ప్రకటనపై క్లిక్ చేస్తే, అది వారిని ఇతర ప్రకటనల మాదిరిగానే YouTube నుండి ఒరిజినల్ ప్లాట్‌ ఫారమ్‌కు తీసుకువెళుతుంది.


యూట్యూబ్ యాడ్స్ లో రకాలు ఎన్నో!   


⦿ యూట్యూబ్ పలు రకాల ఫార్మట్లలో యాడ్స్ ప్రదర్శించడానికి క్రియేటర్స్ కు అనుమతిస్తుంది.


⦿ ఫీచర్ వీడియోల కుడి వైపున, వీడియో సూచనల జాబితా పైన కనిపించే డిస్ ప్లే యాడ్స్ ఉంటాయి. ప్రధాన వీడియోకు ముందు లేదంటే, తర్వాత ప్లే చేసే స్కిప్  వీడియో ప్రకటనలు ఉంటాయి. వీక్షకులు 5 సెకన్ల తర్వాత ఈ ప్రకటనలను స్కిప్ చేసే అవకాశం ఉంటుంది.   


⦿ మెయిన్ వీడియో చూడటానికి ముందు వీడియో ప్లేయర్‌లో తప్పక చూడవలసిన స్కిప్ చేయలేని వీడియో ప్రకటనలు కూడా ఉన్నాయి. బంపర్ ప్రకటనలు కూడా స్కిప్ చేయలేని వీడియో ప్రకటనలు. కానీ, 15-20 సెకన్ల పాటు ఉండే ఇతర నాన్ స్కిప్ ప్రకటనల మాదిరిగా కాకుండా, ఇవి 6 సెకన్ల వరకు ఉంటాయి.


⦿ చివరి రకమైన యాడ్స్ స్పాన్సర్ చేయబడిన కార్డ్‌లు. ఇవి వీడియోకు సంబంధించిన ఉత్పత్తుల  ప్రచార కంటెంట్‌ను ప్రదర్శిస్తాయి.


Read Also: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!