ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం జరిగిన వెంటనే రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నేతలు కవితకు నోటీసులు రావడంపై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఆమె అరెస్టు ఖాయం అంటూ చెబుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.


వారి కుటుంబానికి ఏం జరిగినా తెలంగాణ మొత్తానికి ఆపాదిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. సీబీఐ, ఈడీ మోదీ పెట్టిన సంస్థలు కావని, కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న దందాలన్నింటికి బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.


కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తాయని అన్నారు. కవిత తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని అన్నారు. కవిత ఈడీ విచారణకు సహకరించాలని అన్నారు. తాజాగా ఈడీ అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లై తనకు తెలుసని కవితే చెప్పారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కవిత కోర్టుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు. కవితకు నోటీసులిస్తే తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత బీఆర్ఎస్ కు లేదని అన్నారు. బీఆర్ఎస్ కు మహిళా అధ్యక్షులెవరో ఇంతవరకు తెలవదని అన్నారు. 


కవితకు ఈడీ నోటీసులు రావడంపై ఇంత వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు, లిక్కర్‌ స్కాంపై డీకే అరుణ స్పందిస్తూ.. లిక్కర్‌ స్కామ్‌లో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. కవిత పాత్ర లేకపోతే అదే విషయాన్ని ఈడీకి చెప్పాలని విలేకరులతో మాట్లాడారు.


తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా? - కిషన్ రెడ్డి


తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది.. సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది.. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి అని కిషన్ రెడ్డి నిలదీశారు.


మొదటిసారి నీవల్లె తెలంగాణ తల వంచుతోంది - ధర్మపురి అర్వింద్


‘‘తెలంగాణ మొదటి లేదా ఇటీవలి ఉద్యమంలో ఎవరికీ తలవంచలేదు, కానీ ఇప్పుడు మీ ప్రమేయం (కవిత) చూసి దేశం ముందు సిగ్గుతో తెలంగాణ తలవంచుతోంది’’ అని ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2014-2018 వరకు ఒక్క మహిళ కూడా మంత్రిగా లేదని గుర్తు చేశారు. అప్పుడు నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న కవిత పార్టీలో ఆధిపత్యానికి స్పష్టమైన కారణాల వల్ల మహిళలకు కేబినెట్‌లో అవకాశం లేదని బీజేపీ ఎంపీ విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అయిన తన చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత నెపోటిజం కోటాలో కవిత ఎమ్మెల్సీ అయ్యారని ఎద్దేవా చేశారు.