ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను ఈ నెల 10న మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టానని, ఇంతలోనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని కవిత అన్నారు. తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని కవిత ట్వీట్ చేశారు.
‘‘పార్లమెంటులో మహిళల ప్రాతినిథ్యం కోసం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి డిమాండ్ చేస్తూ మేం శాంతియుత నిరసన తలపెట్టాం. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగ్రుతి సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసి నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయ్యేలా చూడాలని బీజేపీని డిమాండ్ చేయాలని నిర్ణయించారు.
ఈలోపు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి నాకు సమన్లు అందాయి. మార్చి 9న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు.
బాధ్యత గల పౌరురాలిగా నేను విచారణ సంస్థలకు అన్ని విధాలుగా సహకరిస్తాను. ధర్నాతో పాటు నాకు ముందస్తుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున విచారణ తేదీ మార్పు విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాను.
బీఆర్ఎస్ పార్టీపై, మా నాయకుడు కేసీఆర్‌పై ప్రయోగిస్తున్న ఇలాంటి వ్యూహాలు మమ్మల్ని ఏమీ చేయలేవని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాను. బీఆర్ఎస్‌ను గానీ, కేసీఆర్ గారిని గానీ మీరు లొంగదీసుకోలేరు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ విఫల విధానాలపై మేం పోరాడుతూనే ఉంటాం. దేశ భవిష్యత్తు కోసం మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. ఢిల్లీలో అధికారంలో ఉన్నవారి ముందు తెలంగాణ ఎప్పటికీ తల వంచబోదనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా మేము పోరాడుతూనే ఉంటాం’’ అని కవిత ఓ ప్రకటన విడుదల చేశారు.