Bopparaju Meet CS :  పోరుబాట పట్టిన ఏపీ ప్రభుత్వ  ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం అయింది.  విజయవాడలోని సీఎస్  క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు. చర్చలు జరుగుతున్నప్పటికీ.. గురువారం నుంచి తాము ప్రకటించిన  ఉద్యమ కార్యాచరణ  కొనసాగుతుందని  ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు.  ఉద్యోగుల సమస్యలపై లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని బొప్పరాజు స్పష్టం చేసారు.  సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి బృందం తమ వైఖరిని స్పష్టం చేసింది.


చర్చల్లో అంగీకరించిన విషయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలన్న ఏపీ జేఏసీ అమరావతి 


నిన్నటి చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యాచరణ కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడారు బొప్పరాజు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామని బొప్పరాజు తెలిపారు.   సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే.. గురువారం ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే.. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందననారు.  


మినిట్స్ ఇస్తే గురువారం మధ్యాహ్నం కార్యాచరణపై నిర్ణయం 


మినిట్స్ ఇస్తే.. ఉద్యమాన్ని రేపు మధ్యాహ్నాం వరకు వాయిదా వేస్తాం.. కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని బొప్పరాజు తెలిపారు.  మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని.. .ఆయుధం మా చేతుల్లోనే ఉందని బొప్పరాజు ప్రకటించారు.  మేం ప్రభుత్వం ట్రాపులో పడడం లేదని స్పష్టం చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు సంబంధం లేదని..   మా అజెండా నుంచి పక్కకు వెళ్లమని బొప్పరాజు తెలిపారు.   ప్రభుత్వం ఉద్యమాన్ని అడ్డుకున్నా పది మందితో అయినా ఉద్యమం నడిపిస్తామని బొప్పరాజు చెబుతున్నారు. 


ఉద్యోగ సంఘాల చర్చలతో పలు హామీలు ఇచ్చిన ప్రభుత్వం 


ఉద్యోగ సంఘాలతో  మంగళవారం ప్రభుత్వం జరిపిన చర్చల్లో పలు రకాల హామీలు ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న నిధుల్లో రూ. మూడు వేల కోట్లను నెలాఖరు కల్లా విడుదల చేస్తామని ఆ తర్వాత ఏప్రిల్ లో కొంత.. సెప్టెంబర్ కల్లా మరికొంత విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే మరికొన్ని ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి కోరుతోంది.   దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇవ్వకపోతే.. కార్యాచరణ కొనసాగిస్తామని బొప్పరాజు చెబుతున్నారు.