ప్రపంచంలో అత్యంత కీలకమైన యాప్స్ లో వాట్సాప్ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎంతో మంది వ్యక్తిగత, ఉద్యోగ సంబంధ పనులను చక్కబెట్టుకుంటున్నారు. రోజు వారీ పనుల్లో సగానికిపైగా ఈ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. 400 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్టై ఉన్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవల్లో, వాట్సాప్ ముందంజలో ఉంది. వినియోగదారుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అన్ని సందేశాలను భద్రపరచడంతో పాటు, ప్రైవసీని ఎల్లప్పుడూ రక్షిస్తుందని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాట్సాప్ వినియోగించే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని ప్రైవసీ ఫీచర్లు గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. తప్పకుండా తెలుసుకుని, జాగ్రత్తగా ఉండండి. 


1. మీరు ఎవరితో మాట్లాడాలో సెలెక్ట్ చేసుకోండి


వాట్సాప్ అనేది మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు మీ ఫోన్ నంబర్‌ను కలిగి ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే వేదిక. అయితే, వినియోగదారులు తెలియని నంబర్ల నుంచి ఇబ్బందికర మెసేజ్ లను స్వీకరించే సమయాల్లో,  WhatsApp అకౌంట్ ని  'బ్లాక్ చేసి, రిపోర్టు’ కొట్టవచ్చు. బ్లాక్ చేయబడిన కాంటాక్ట్స్ నుంచి ఇకపై మెసేజ్ లు, కాల్స్ వచ్చే అవకాశం లేదు.  


2. మీ మెసేజ్‌లు, ప్రైవసీపై మరింత నియంత్రణ  కలిగి ఉండండి


వాట్సాప్ లో అంతర్నిర్మిత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో, మీ మెసేజ్ లు,  ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్ లు, డాక్యుమెంట్స్, కాల్స్ చాలా సురక్షితంగా ఉంటాయి. వినియోగదారులు తమ సంభాషణలపై మరింత నియంత్రణ, గోప్యతను పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు ఎంచుకున్న వ్యవధిని బట్టి 24 గంటలు, 7 రోజులు లేదంటే 90 రోజుల లోపు  డిసప్పియర్ అయ్యేలా చేసుకోవచ్చు. వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి అదనపు రక్షణగా స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది.


3. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్   


వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్, గ్రూప్ ఇన్వైట్ సిస్టమ్ లో వినియోగదారులను గ్రూపులకు ఎవరు యాడ్ చేయవచ్చో నిర్ణయించుకోవడానికి అనుమతిస్తుంది. వినియోగదారు ప్రైవసీ పెంచడం, వారు భాగం కాకూడదనుకునే గ్రూపులకు  వినియోగదారుని జోడించకుండా నిరోధించడం లాంటి అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేని గ్రూప్ చాట్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తే, ఎవరికీ తెలియకుండానూ మీరు గ్రూప్ నుండి ప్రైవేట్‌గా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది.


4. మీ ఆన్‌లైన్ సమాచారంపై నియంత్రణ కలిగి ఉండండి


వాట్సాప్‌లో, వినియోగదారులు తమ ఆన్‌లైన్ సమాచారానికి యాక్సెస్ పొందే వ్యక్తిని ఎంచుకోవడం ద్వారా – ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్, ఎబౌట్ సహా వ్యక్తిగత వివరాలను నియంత్రించవచ్చు. ఆల్, కాంటాక్ట్స్ ఓన్లీ, సెలెక్ట్ కాంటాక్ట్స్, నో వన్ లాంటి ఆప్షన్స్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు WhatsAppని ప్రైవేట్‌గా తనిఖీ చేయాలనుకుంటే, ఆన్ లైన్ లో ఉన్నా, నో వన్ సీన్ అనే ఆప్షన్ ఓకే చేసుకుంటే ఎవరికీ కనిపించరు.  


5. మీ అకౌంట్ ప్రైవసీని కాపాడుకోండి


టు స్టెప్స్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రారంభించడం ద్వారా వినియోగదారులు తమ అకౌంట్ కు అదనపు భద్రతను జోడించడానికి వాట్సాప్ అనుమతిస్తుంది. దీనికి మీ వాట్సాప్ అకౌంట్ ను ఖాతాను రీసెట్ చేసేటప్పుడు, ధృవీకరించేటప్పుడు ఆరు అంకెల పిన్ అవసరం. మీ ఫోన్ దొంగిలించబడినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.