సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి ఓ విమానయాన సంస్థ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వార్త కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..


ఇటీవల మంచు లక్ష్మి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చింది. అయితే విమానం దిగిన తర్వాత అందులో బ్యాగ్ మరచిపోయిన విషయం గుర్తొచ్చింది. వెంటనే వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ లోపు విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. బ్యాగ్ మరచిపోయాను తెచ్చుకోవాలి అని చెప్పినా వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆమె అక్కడే కూర్చోవాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా ఆమె వెయిట్ చేసినట్టు తెలిపింది. ఆ సమయంలో తాను 103 డిగ్రీల ఫీవర్ తో ఉన్నానని, అయినా కూడా విమాన సిబ్బంది పట్టించుకోలేదని వాపోయింది. ఆరోగ్యం బాగోకపోయినా కూడా విమాన సిబ్బంది అలా ప్రవర్తించడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. జరిగిదంతా తన సోషల్ మీడియా ఖాతాలో రాసి షేర్ చేసింది మంచు డాటర్. 


కనీసం కస్టమర్ సర్వీస్ కూడా లేదు: మంచు లక్ష్మి


తాను తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావడానికి కూడా అంత సమయం పట్టలేదు అంటూ దుయ్యబట్టింది లక్ష్మి. గంటకు పైగా ఎదురు చూశానని, ఎవ్వరూ కూడా తన బ్యాగ్ తెచ్చి ఇవ్వలేదని విమర్శించింది. గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్ ఒక్కరు కూడా కనిపించలేదని, కస్టమర్ సర్వీస్ లేకుండా సంస్థ ఎలా నడుస్తుందో అంటూ చురకలంటించింది. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసి తన నిరసనను వ్యక్తం చేసింది లక్ష్మి. దీంతో ఈ వార్త చర్చనీయాంశమైంది.


స్పందించిన ఇండిగో..


మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై ఇండిగో విమాన సంస్థ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అని పేర్కొంది. తమ సిబ్బందితో మాట్లాడామని, వారు మీతో మాట్లాడతారు అని ట్వీట్ చేసింది. మీరు బ్యాగ్ ను కలెక్ట్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాం, తిరిగి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం అని ఇండిగో పేర్కొంది. 


అయితే విమానాల్లో లేదా విమానాశ్రయాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. గతంలోనూ పలువురు ప్రముఖులు విమాన సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు కూడా. అయితే మంచు లక్ష్మి ట్వీట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం అంత జ్వరంలో ప్రయాణాలు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 


Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?