ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చే వాట్సాప్.. మరో వెసులుబాటును కల్పించబోతుంది. ఇప్పటికే  వాట్సాప్‌లో నేరుగా పెద్ద ఫైళ్లను షేర్ చేయడానికి అనుమతించిన మెటా కంపెనీ.. ఇప్పుడు కొత్త  ఫీచర్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్ లో పంపే డాక్యుమెంట్ కు క్యాప్షన్ పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది. వాట్సాప్ అప్‌డేట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ WaBetaInfo ఈ సరికొత్త ఫీచర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. యాప్‌లోని సెర్చ్ ఆప్షన్‌ ని ఉపయోగించి చాట్‌లలో షేర్ చేసిన డాక్యుమెంట్‌లను సులభంగా కనుగోవడంలో సహాయపడే ముఖ్యమైన అప్‌ డేట్‌ కోసం కంపెనీ పనిచేస్తోందని వెల్లడించింది.  


WhatsApp ప్రస్తుతం తన ప్లాట్‌ ఫామ్‌ లో భాగస్వామ్యం చేయబడిన ఫోటోలు, వీడియోలు, GIFల కోసం మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.  కొత్త  అప్‌ డేట్ ప్రకారం చాట్‌ లో షేర్ చేసే డాక్యుమెంట్లకు  క్యాప్షన్ రాసే అవకాశం ఉంటుంది. "ఈ ఫీచర్‌ కు ధన్యవాదాలు. వినియోగదారులు క్యాప్షన్‌ను గుర్తుంచుకుంటే వారి డాక్యుమెంట్‌లను త్వరగా కనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే సెర్చ్ టెక్స్ట్ ఫీల్డ్‌ లో క్యాప్షన్‌ ను రాయడం ద్వారా డాక్యుమెంట్స్  వెతకడం మరింత ఈజీ అవుతుంది" అని WaBetaInfo వెల్లడించింది.






మెసేజ్ ఎడిట్ ఫీచర్ పైనా ప్రయోగాలు


వాట్సాప్‌  అటు ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే.. దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదు. ఏదైనా మెసేజ్‌ను పొరపాటుగా పంపిస్తే కచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ, వాట్సాప్ ఇకపై ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించబోతుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ పంపిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో ఎప్పుడైనా హడావిడిగా పంపిన మెసేజ్ లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని ఆ తర్వాత సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ కు సంబంధించిన విషయాలను తాజాగా వెబ్ బీటా ఇన్ఫో వెల్లడించింది.


వాస్తవానికి వాట్సాప్ ​లో ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ పై చాలా రోజులుగా పరిశోధన జరుగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఓసారి ఈ విషయం గురించి వాట్సాప్ ప్రస్తావించింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. వాట్సాప్​ యూజర్స్​ కూడా మెసేజ్ ఎడిట్ ఫీచర్ గురించి ఎదురుచూస్తున్నారు. తాజాగా వెబ్ బీటా ఇన్ఫో ఈ విషయానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ దశలో ఉన్నట్లు తెలిపింది.  ఆండ్రాయిడ్ 2.22.20.12 బిల్డ్ కోసం WhatsApp బీటాలో WaBetaInfo ద్వారా ఈ ఫీచర్ గుర్తించబడింది. ఈ ఫీచర్ ఇంకా బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి రాలేదు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?