WhatsApp Testing New Security Feature: ప్రపంచ పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వినియోగదారులకు మెరుగైన చాటింగ్ అనుభవం కలిగించడంతో పాటు ప్రైవసీ విషయంలో మరిన్ని ప్రయోగాలు కొనసాగిస్తోంది. అంతేకాదు, వాట్సాప్ వేదికగా జరిగే చర్చలు ఎలాంటి వివాదాలకు కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజానికి వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించే యూజర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. హెచ్చరికలను పట్టించుకోకపోతే శాశ్వతంగా సదరు అకౌంట్లను బ్యాన్స్ చేస్తూనే ఉంది.
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. రూల్స్ వయోలేట్ చేసిన అకౌంట్లను పర్మినెంట్ గా బ్యాన్ చేయకుండా, కాస్త ఉదారభావంతో వ్యవహరించబోతోంది. అంటే, వాట్సాప్ రూల్స్ కు వ్యతిరేకంగా మెసేజ్ లు పంపితే, ఆయా అకౌంట్లను కొంత కాలం పాటు బ్లాక్ చేస్తుంది. ఈ ఫీచర్ కేవలం కొత్త చాట్స్ చేయకుండా మాత్రమే అడ్డుకుంటుంది. పాత చాట్స్ తో మెసేజ్ లు కొనసాగించుకోవచ్చు.
తప్పును గుర్తించేలా చేయడమే లక్ష్యం
కొద్ది కాలం పాటు వాట్సాఫ్ చాటింగ్ ను నిలిపి వేయడానికి గల కారణాలను సైతం వాట్సాప్ వెల్లడించింది. గత కొంత కాలంగా కొన్ని దేశాల్లో స్పామ్ మెసేజ్ లు బాగా ఫార్వర్డ్ అవుతున్నట్లు గుర్తించింది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణంతో పర్మినెంట్ గా బ్యాన్ చేయకుండా, తప్పును వారికి గుర్తు చేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్ పని చేయనుంది. కొద్ది సమయం బ్యాన్ తర్వాత మళ్లీ వాళ్లు తిరిగి వాట్సాప్ చాట్ చేసుకునే అవకాశం కలగనుంది.
వాట్సాప్ బీటా ఇన్ఫో ఏం చెప్తుందంటే?
ఇక సరికొత్త ఫీచర్ గురించి వాట్సాప్ బీటా ఇన్ఫో కీలక విషయాలను వెల్లడించింది. తాత్కాలికంగా బ్యాన్ చేయబడిన అకౌంట్ నుంచి కొత్త నెంబర్స్ కు మెసేజ్ చేసే అవకాశం లేదని తెలిపింది. అయితే, అప్పటికే ఉన్న చాట్స్ కు మెసేజ్ పంపుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, ఏ కారణం చేత వాట్సాప్ తాత్కాలికంగా నిషేధానికి గురైంది? అనే విషయాన్ని కూడా తెలియనున్నట్లు వెల్లడించింది. ఈ అప్ డేట్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ అప్ డేట్ వచ్చిన వెంటనే యూజర్లకు అర్థం అయ్యేలా పాప్ అప్ మెసేజ్ బ్లింక్ అవుతుందని వెల్లడించింది. తాత్కాలికంగా బ్యాన్ చేసినా, చాట్ హిస్టరీకి ఎలాంటి ఇబ్బంది కలగదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే కొత్త ఫీచర్ అకౌంట్స్ ను కాకుండా చాట్స్ ను మాత్రమే చేయకుండా అడ్డుకుంటుందని వివరించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాన్ మరింత ప్రొటెక్టివ్ గా ఉంటుందని మెటా సంస్థ వెల్లడించింది. వినియోగదారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపింది.
Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!