యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ల మధ్య వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. మనం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోనుకు మారినా లేదా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోనుకు మారినా వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి వచ్చేది. ఇది చాలా కష్టతరమైన పని అనే చెప్పవచ్చు. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వాట్సాప్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసింది. అయితే ఇది తొలుత శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లలో మాత్రమే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఎవరైనా యూజర్లు ఐఫోన్ నుంచి శాంసంగ్ నుంచి కొత్తగా రిలీజైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ జెడ్ పోల్డ్ 3 ఫోన్లకు మారితే.. వారికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
వాట్సాప్‌లో వాయిస్ నోట్స్, ఫోటోలు, కన్వర్జేషన్లు సహా అన్ని వివరాలు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లుకు ట్రాన్స్‌ఫర్ అవుతాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐఫోన్ నుంచి శాంసంగ్ ఫోన్లకు మారే యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని శాంసంగ్ భావిస్తోంది.
ఇదే విషయాన్ని వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థల అధినేత విల్ కాథ్‌కార్ట్, వాట్సాప్ ప్రొడక్ట్ మేనేజర్ సందీప్ పరుచూరి సైతం ధ్రువీకరించారు.
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ఫొటో ఎడిటింగ్..
ఎప్పటికప్పుడు కొత్త పీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ఇటీవల డెస్క్‌టాప్‌లో ఫొటోలను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటికే ఇది యాప్‌లో అందుబాటులో ఉండగా.. డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లో మాత్రం లేదు. తాజాగా ఈ ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లోనూ పరిచయం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ‘డ్రాయింగ్ టూల్’ అనే పేరుతో ఈ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. దీంతో యూజర్లు వాట్సాప్ డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లో ఫొటోలను ఫార్వర్డ్ లేదా షేర్ చేసే ముందు వాటిని క్రాప్, రొటేషన్ వంటి వాటితో పాటుగా ఎమోజీలు, టెక్ట్స్ లను యాడ్ చేసుకోవచ్చు.
Also Read: Pegasus Spyware: ఐమాజింగ్.. ఐఫోన్లలో పెగాసస్ జాడ కనిపెట్టే యాప్.. ఎలా పని చేస్తుందో తెలుసుకోండి