ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేరిట కేటుగాళ్లు వినియోగదారులకు స్కామ్ వల విసురుతున్నారు. వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్లు వచ్చాయని, లింక్ క్లిక్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాలంటూ స్కామర్లు వినియోగదారులకు లింకులు పంపిస్తున్నారు. ‘పింక్ వాట్సాప్’ పేరుతో వస్తున్న ఈ లింక్ ను క్లిక్ చేస్తే యూజర్లకు సంబంధించిన డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది.
పింక్ వాట్సాప్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన ముంబై పోలీసులు
తాజాగా ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు, పింక్ వాట్సాప్ పేరుతో వచ్చే లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఓ అడ్వైజరీని జారీ చేశారు. ‘పింక్ వాట్సాప్’ పేరిట ఎలాంటి లింక్ వచ్చినా క్లిక్ చేయకూడదని వెల్లడించారు. యాప్ ను కూడా ఇన్ స్టార్ చేసుకోవద్దని చెప్పారు. “న్యూ పింక్ లుక్ వాట్సాప్ పేరిట అదనపు ఫీచర్ల కోసం ఇన్ స్టాల్ చేసుకోవాలంటూ కొద్ది రోజులుగా వాట్సాప్ లో లింకులు వస్తున్నాయి. ఈ లింకులు చాలా డేంజరస్. తెలిసీ తెలియక ఆ లింకును క్లిక్ చేస్తే మోబైల్ హ్యాకింగ్ కు గురవుతుంది. సైబర్ నేరగాళ్లు యూజర్లకు సంబంధించిన డేటా అంతా దొంగిలించే అవకాశం ఉంటుంది. వాట్సాప్ నుంచి వచ్చే ఎలాంటి అపరిచిత లింకులను క్లిక్ చేయకూడదు” అని ముంబై పోలీసులు హెచ్చరించారు.
ఇంతకీ పింక్ వాట్సాప్ స్కామ్ అంటే ఏంటి?
వాట్సాప్ కు సంబంధించిన లోగో కలర్ పింక్ రంగులోకి మార్చుకోవడంతో పాటు కొత్త ఫీచర్లను పొందే అవకాశం ఉందంటూ కొద్ది రోజులుగా వాట్సాప్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందుకోసం ఓ లింకును పంపి దానిని ఇన్ స్టాల్ చేయాలని సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. తెలిసీ తెలియక చాలా మంది వినియోగదారులు ఆ లింకును క్లిక్ చేస్తున్నారు. దీంతో సదరు వినియోగదారుల ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వినియోగదారుడికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు, డివైజ్ లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకు వివరాలు కేటాగాళ్ల ఆధీనంలోకి వెళ్తున్నాయి. ఒక్కోసారి ఫోన్ కు సంబంధించి పూర్తి కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకే వెళ్లిపోతుంది.
కొత్త స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే?
వాస్తవానికి పింక్ వాట్సాప్ స్కామ్ బాధితుల్లో ఎక్కువగా ఆండ్రాయ్ వినియోగదారులే ఉన్నారు. ఎందుకంటే, యాపిల్ ఫోన్ల వినియోగదారులు కేవలం ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచే యాప్స్ డౌన్ లోడు చేసుకుంటారు. ఇలాంటి స్కామ్ యాప్ లకు చోటు లేకుండా యాపిల్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే , ఈ మోసాలు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. ఒక వేళ మీరు తెలియకుండా పింక్ వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేస్తే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. అంతేకాదు, ఇలాంటి మెసేజ్ లింకులను ఫార్వర్డ్ చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ లాగిన్ వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయకూడదు. వీలుంటే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవడం ఉత్తమం.
Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!