ట్విట్టర్ ను సొంతం చేసుకున్న నాటి నుంచి ఎలన్ మస్క్ తీసుకునే నిర్ణయాలు పెను సంచలనానికి కారణం అవుతున్నాయి. ఇప్పటి వరకు ట్విట్టర్ లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన ఆయన, తొలిసారి ప్రత్యర్థి సంస్థలను టార్గెట్ చేశారు. ఏకంగా వాట్సాప్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. వాట్సాప్ ను విశ్వసించలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మస్క్ వ్యాఖ్యలు వాట్సాప్ కు తీవ్ర తలనొప్పులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.


వివాదంలో వాట్సాప్


ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో వాట్సాప్ ముందుంటుంది. మెసేజెస్, వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్ సహా పలు రకాల అవసరాల కోసం వినియోగదారులు ఈ యాప్ ను వినియోగిస్తారు. అయితే, వాట్సాప్ సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్ వాట్సాప్‌ సెక్యూరిటీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్టులో ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ చేరారు. వాట్సాప్‌ ను నమ్మలేమంటూ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.  


ఇంతకీ ఏం జరిగిందంటే?


తాను నిద్రిస్తున్నప్పుడు కూడా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్  ఫోడ్ డబిరి ఆరోపించారు.  తన వాదనలకు మద్దతుగా ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు.  ఇందులో అతడి WhatsApp మైక్రోఫోన్‌ను  ఉదయం 4:20 నుంచి 6:53 వరకు యాక్సెస్ చేసినట్లు కనిపిస్తోంది. "నేను నిద్రపోతున్నప్పుడు, నేను లేచినప్పుడు కూడా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోంది.ఏమి జరుగుతోంది?" అంటూ ట్వీట్ చేశారు.






ఫోడ్ డబిరి ఆరోపణలపై వాట్సాప్ వివరణ


డబిరి ఆరోపణలపై వాట్సాప్ వివరణ ఇచ్చింది. ఆండ్రాయిడ్‌లో  తమ గోప్యతా డాష్‌బోర్డ్‌ లో సమాచారాన్ని తప్పుగా ఆపాదించే  బగ్ కారణంగా సమస్య తలెత్తుతుందని వివరించింది. వినియోగదారుడి దగ్గర ఉన్న ఫోన్ గూగుల్ పిక్సెల్ అని,  ఈ విషయాన్ని పరిశోధించి, పరిష్కారాన్ని అందించమని గూగుల్‌ను కోరినట్లు వెల్లడించింది. మరో ట్వీట్‌లో, WhatsApp  వినియోగదారులకు వారి మైక్రోఫోన్ సెట్టింగ్‌లపై  పూర్తి నియంత్రణ  ఉందని వివరించింది. వినియోగదారు కాల్ చేస్తున్నప్పుడు, వాయిస్ నోట్,  వీడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్‌ని యాక్సెస్ చేయగలరని పేర్కొంది.










వాట్సాప్ ను నమ్మలేం, వాట్సాప్ లాంటి ఫీచర్లను ట్విట్టర్‌లో తెస్తున్నాం- మస్క్


అటు తమ కంపెనీ ఉద్యోగి చేసిన ట్వీట్ పూ మస్క్ రీట్వీట్ చేశారు. వాట్సాప్‌ నమ్మదగినది కాదంటూ సంచల  స్టేట్ మెంట్ పాస్ చేశారు. మస్క్‌ ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.   ఆయన ట్వీట్‌ కచ్చితంగా వాట్సాప్‌ కు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  సంస్థ తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.  అటు మరో సంచలన ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో వాట్సాప్ లాంటి ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.  వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.    










Read Also: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్