Vivo V30 Launched: వివో వీ30 స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ స్క్రీన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 


వివో వీ30 ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే భారత్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, మలేషియా, సింగపూర్, థాయ్‌ల్యాండ్, యూఏఈ సహా 30 దేశాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. వివో వీ30 సిరీస్ మొదట మెక్సికోలో ఫిబ్రవరి 8న లాంచ్ కానుంది. బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


వివో వీ30 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉన్న 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 2800 నిట్స్‌గా ఉండటం విశేషం.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ50ఈ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పొర్‌ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగా పిక్సెల్ లెన్స్‌ను అందించారు. అంటే మొత్తంగా మూడు 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయన్న మాట.


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లుగా ఉంది.


మరోవైపు వివో జీ2 స్మార్ట్ ఫోన్ చైనాలో సైలెంట్‌గా లాంచ్ అయింది. వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోర్ట్‌ఫోలియోలో ఈ ఫోన్ జాయిన్ అవ్వడం విశేషం. ఈ ఫోన్‌లో 6.58 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై వివో జీ2 పని చేయనుంది. ఇందు‌లో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై వివో జీ2 పని చేయనుంది. దీని ధర చైనాలో  1,199 యువాన్ల (సుమారు రూ.14,000) నుంచి ప్రారంభం కానుంది.


Read Also: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?