ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సరికొత్త ఫీచర్ లాంచ్ చేసింది. దీని పేరు సూపర్ ఫాలోస్. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా.. నెల వారీ డబ్బు సంపాదించవచ్చని కంపెనీ తెలిపింది. అమెరికా, కెనడా దేశాల్లోని ఐవోఎస్ యూజర్లకు మాత్రమే ఈ సూపర్ ఫాలోస్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరికొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐవోఎస్ యూజర్లకు దీనిని తీసుకురానున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా మానిటైజేషన్ అందించే సదుపాయం కూడా ఉంటుందని చెబుతోంది.
ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ క్రియేటర్లు.. నెలవారీ సబ్ స్క్రిప్షన్ కింద 2.99 డాలర్లు (సుమారు రూ.220), 4.99 డాలర్లు (సుమారు రూ.360), లేదా 9.99 డాలర్లు (సుమారు రూ.730) చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే వారి కంటెంట్ ఎక్కువగా ఎంగేజ్ అయ్యేలా.. ఫీచర్ అందిస్తామని ట్విట్టర్ తెలిపింది. ఈ ఫీచర్ విజయవంతం అయితే.. యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలలాగా ట్విట్టర్ లోనూ సంపాదించవచ్చు.
వినియోగదారుల భద్రత కోసం మరో కొత్త సేఫ్టీ ఫీచర్ అందిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ఈ సేఫ్టీ ఫీచర్ ద్వారా.. హానికరమైన భాషను ఉపయోగించిన వారితో పాటు మన అనుమతి లేకుండా రిప్లై ఇచ్చే వారిని వారం పాటు తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ట్విట్టర్ మనం బ్లాక్ చేసిన ట్వీట్ లో నెగిటివ్ కంటెంట్ ఉందా అని చెక్ చేస్తుంది. అలాగే మనం బ్లాక్ చేసిన వ్యక్తితో మనకున్న సంబంధాన్ని పరిశీలిస్తుంది. అతను మనతో తరచుగా సంభాషించే వ్యక్తే (ట్వీట్ల ద్వారా) అయితే దీనిని పరిగణనలోకి తీసుకోదు. తెలియని వ్యక్తి అయితే చర్యలు తీసుకుంటామని కంపెనీ చెప్పింది.