అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్‌ను ప్రారంభించనున్నారు. దీనికి ట్రూత్ సోషల్ అని పేరు పెట్టారు. ట్వీటర్, ఫేస్‌బుక్ వంటి పెద్ద టెక్నాలజీ కంపెనీలు ట్రంప్ ఖాతాలపై ఆంక్షలు విధించాయి. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ట్రూత్ సోషల్ అనే యాప్‌ను కొత్త కంపెనీ ద్వారా ప్రారంభించనున్నట్లు ట్రంప్ తెలిపాడు.
ట్వీటర్‌లో తాలిబన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ మాత్రం సైలెంట్‌గా ఉండాల్సి వస్తుంది. ఇది ఎంతమాత్రం ఆమోదించదగ్గది కాదని ట్రంప్ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాడు. తన మొదటి ట్రూత్‌ను ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. పెద్ద టెక్ కంపెనీలపై పోరాటం కోసం, తన ఆలోచనలను పంచుకోవడం కోసం ట్రూత్ సోషల్ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపాడు.
దీనికి సంబంధించిన బీటా లాంచ్ వచ్చే నెలలో జరగనుంది. 2022 మొదటి త్రైమాసికంలో ఫుల్ రోల్అవుట్ కూడా ప్రారంభం కానుంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ(టీఎంటీజీ) కంపెనీ పేరుతో ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు టీఎంటీజీ ప్లస్ అనే సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసును కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
అమెజాన్.కాంకు చెందిన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసులు, గూగుల్ క్లౌడ్ సర్వీసులకు పోటీగా.. కొత్త సేవలు కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికార ప్రతినిధి లిజ్ హారింగ్టన్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఎంతో కాలం నుంచి పెద్ద టెక్ కంపెనీలు చాలా మందిని మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయని ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు.
ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి ఇతర సోషల్ మీడియా కంపెనీలు డొనాల్డ్ ట్రంప్‌ను తమ ప్లాట్‌ఫాంల నుంచి బహిష్కరించాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని, తాను ఓడిపోలేదని ట్రంప్ ఒక ప్రసంగంలో చెప్పిన అనంతరం అతని మద్దతుదారులు అమెరికా రాజధానిలో దాడులకు దిగారు. ఆ కారణంగానే ట్రంప్‌ను ఫేస్‌బుక్, ట్వీటర్ బహిష్కరించాయి.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?