యాపిల్ తన అన్‌లీష్డ్ ఈవెంట్‌లో కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను లాంచ్ చేసింది. వీటిలో కొత్త ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్లను అందించారు. 14 అంగుళాలు, 16 అంగుళాల డిస్‌ప్లేలను ఇందులో అందిస్తున్నారు. ప్రస్తుతం 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో ఉన్న ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ కంటే 3.7 రెట్లు వేగంగా ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. గతేడాది లాంచ్ అయిన ఎం1 చిప్‌కు తర్వాతి వెర్షన్లుగా ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్ లాంచ్ అయ్యాయి.


యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2021) ధర, సేల్ వివరాలు
14 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.1,94,900గా ఉంది. విద్యార్థులకు ఇది రూ.1,75,410కే లభించనుంది. ఇక 16 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.2,39,900గా నిర్ణయించారు. విద్యార్థులకు రూ.2,15,910కే ఇది లభించనుంది.


దీనికి సంబంధించిన ఆర్డర్లు మనదేశంలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 26వ తేదీ నుంచి యాపిల్ సైట్‌లో వీటి సేల్ జరగనుంది.


యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) స్పెసిఫికేషన్లు
ఇందులో 14 అంగుళాలు, 16 అంగుళాల మోడళ్లు ఉన్నాయి. వీటి డిజైన్‌లో కూడా పలు మార్పులు చేశారు. టచ్ బార్‌ను తీసేసి, ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్, హెచ్‌డీఎంఐ పోర్టును అందించారు. 1080పీ ఫేస్‌టైం వెబ్‌క్యామ్‌ను కూడా ఇందులో అందించారు. అయితే ఇందులో ఫేస్ ఐడీ టెక్నాలజీ లేదు.


14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో 14.2 అంగుళాల యాక్టివ్ ఏరియా, 59 లక్షల పిక్సెల్ ఉండనున్నాయి. 16 అంగుళాల వేరియంట్‌లో 16.2 అంగుళాల టచ్ ఏరియా, 7.7 అంగుళాల పిక్సెల్స్ అందించారు. ఇందులో లిక్విడ్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. మినీ ఎల్ఈడీ టెక్నాలజీని ఇవి ఉపయోగించుకోనున్నాయి. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో పీ3 వైడ్ కలర్ గాముట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, ఎక్స్‌డీఆర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


డిజైన్ లెవల్ మార్పులతో పాటు డిస్‌ప్లే అప్‌గ్రేడెడ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఎం1 ప్రో చిప్‌లో 10 కోర్ల సీపీయూని అందించారు. వీటిలో ఎనిమిది హై పెర్ఫార్మెన్స్ కోర్లు కాగా. రెండు లో పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. 16 కోర్ జీపీయూ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఉన్న ఎం1 చిప్ కంటే 70 శాతం వేగవంతమైన సీపీయూ పెర్ఫార్మెన్స్, రెండు రెట్లు వేగవంతమైన జీపీయూ పెర్ఫార్మెన్స్‌ను ఇది అందించనుంది.


ప్రో నోట్‌బుక్‌కు అందుబాటులో ఉన్న ప్రాసెసర్లలో ప్రపంచంలో బెస్ట్ ప్రాసెసర్ ఎం1 మ్యాక్స్ అంటున్నారు. ఇందులో కూడా 10 కోర్ల సీపీయూని అందించారు. జీపీయూలో మాత్రం 32 కోర్లు ఉండనున్నాయి. ఎం1 కంటే ఏకంగా నాలుగు రెట్ల వేగంగా దీని జీపీయూ పెర్పార్మెన్స్ ఉంటనుంది.


ఇందులో మ్యాజిక్ కీబోర్డును అందించారు. గతంలో ఉన్న టచ్ బార్, పెద్ద ఎస్కేప్ కీకి ఇందులో బై చెప్పేశారు. ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఇందులో ఉంది. మ్యాక్ఓఎస్ మాంటేరే ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్ చిప్‌ల కోసం దీన్ని ఆప్టిమైజ్ చేశారు. 


ఇందులో మాగ్ సేఫ్ చార్జింగ్ పోర్టును అందించారు. బ్లూటూత్ వీ5.0, వైఫై 6 కూడా ఇందులో ఉన్నాయి. ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోను మూడు వరకు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్, 4కే టీవీకి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎం1 ప్రో చిప్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోని రెండు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.


వీటిలో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టం ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 17 గంటల వీడియో ప్లేబ్యాక్, 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 21 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించనున్నాయి.


Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి