ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్ మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోలిస్తే టెలిగ్రామ్ అందించే అప్‌డేట్‌లు విభిన్నంగా ఉంటూ వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఇటీవల 1000 మంది ఒకేసారి గ్రూప్ వీడియో కాల్ చేసుకునేలా ఫీచర్ తీసుకొచ్చిన టెలిగ్రామ్‌.. తాజాగా మరికొన్ని ఫీచర్లను జతచేసింది. బీటా వెర్షన్ 8.0 పేరుతో వచ్చిన ఈ కొత్త అప్‌డేట్‌లో అన్‌లిమిటెడ్ లైవ్‌ స్ట్రీమింగ్, ట్రెండింగ్ స్టిక్కర్స్‌, జంప్‌ టు నెక్ట్స్ ఛానల్, ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


అన్‌లిమిటెడ్ లైవ్‌ స్ట్రీమింగ్..
టెలిగ్రామ్ తన యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ లైవ్‌ స్ట్రీమింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా టెలిగ్రామ్‌లో మనం ఏదైనా కార్యక్రమం లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే దాన్ని అపరిమిత సంఖ్యలో యూజర్స్‌ చూడవచ్చన్న మాట. అంటే వీడియో కాలింగ్ మాదిరిగానే ఇందులో కూడా అపరిమిత సంఖ్యలో వినియోగదారులు పాల్గొనవచ్చు. ఈ లైవ్ స్ట్రీమ్ కార్యక్రమం మధ్యలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్‌ సింబల్‌ను పోస్టు చేయాల్సి ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ చేసేవారు అనుమతిస్తే.. సదరు యూజర్ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రస్తుతం మనం ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎలా అయితే లైవ్‌లో సులువుగా ఇంటరాక్ట్ అవుతున్నామో అలా మాట్లాడవచ్చని టెలిగ్రామ్‌ చెబుతోంది. 


ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్‌ ఫీచర్..
టెలిగ్రామ్‌లో మనకు వచ్చే మెసేజ్‌లను ఫార్వాడ్ చేసే విధానంలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనికి ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్ అని పేరు పెట్టింది. దీని ద్వారా యూజర్‌ తనకు వచ్చిన సందేశాల నుంచి పంపిన వారి పేరు, ఫొటోతోపాటుగా ఉన్న మెసేజ్‌ని డిలీట్‌ చేసి పంపవచ్చని చెబుతోంది. గతంలో టెలిగ్రామ్‌లో మనం ఎవరికైనా మెసేజ్ ఫార్వార్డ్ చేస్తే.. అది అంతకుముందు మనకు ఎవరు పంపారనేది కూడా తెలిసేది. ఈసారి తెచ్చిన ఫీచర్ వల్ల మెసేజ్‌లలో ఆ వివరాలు ఎట్టి పరిస్థితులలోనూ కనిపించవు. అయితే దీనికి మనం ఓ పని చేయాల్సి ఉంటుంది. ఫార్వార్డ్‌ మెసేజ్‌పై క్లిక్‌ చేస్తే.. హైడ్ క్యాప్షన్, హైడ్ సెండర్‌ నేమ్‌ అనే ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేస్తే కేవలం ఫొటో మాత్రమే ఫార్వార్డ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. 


యానిమేటెడ్ స్టిక్కర్లు.. 
యూజర్లకు ట్రెండింగ్ స్టిక్కర్లను సూచించే ఫీచర్‌తో పాటు చాట్‌ల మధ్య మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసే విధానాన్ని కూడా టెలిగ్రామ్‌ తీసుకొచ్చింది. దీని ద్వారా మనం ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు వాళ్లు మనకు టెక్ట్స్‌తో రిప్లై ఇస్తున్నారా లేదా స్టిక్కర్‌తో ఇస్తున్నారా అనేది తెలుస్తుంది. దీంతో పాటుగా.. యానిమేటెడ్ స్టిక్కర్‌లు, ఎమోజీలను సైతం విడుదల చేసింది. యూజర్ చాట్ చేసేటప్పుడు స్టిక్కర్ ఎంచుకుంటే యానిమేటెడ్ స్టిక్కర్లను సజెస్ట్ చేస్తుంది.



Also Read: Car Chip : కార్లకూ కరువొచ్చేసింది ! మార్కెట్లో దొరకట్లేదు ఎందుకో తెలుసా..!?


Also Read: Twitter Super Follows: ట్విట్టర్‌లో సూపర్ ఫాలోస్.. ఇందులోనూ సంపాదించేయొచ్చు!