ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లే స్టోర్ లో ప్రమాదకరమైన మాల్వేర్‌ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ గా గుర్తింపు పొందిన షార్క్‌బాట్(SharkBot) మరోసారి గూగుల్ ప్లే స్టోర్ (Google Playstore)లో కనిపించినట్లు వెల్లడించారు. యాంటీ వైరస్, క్లీనర్ లాంటి యాప్‌ల రూపంలో ఈ మాల్వేర్ ఉన్నట్లు కనుగొన్నారు. మిస్టర్ ఫోన్ క్లీనర్(Mister Phone Cleaner), కిల్ హెవీ మోబైల్ సెక్యూరిటీ(Kylhavy Mobile Security) లాంటి నకిలీ యాంటీ వైరస్, క్లీనర్ యాప్స్ లో ఈ మాల్వేర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మాల్వేర్ ప్రధానంగా బ్యాంకింగ్ తో పాటు క్రిప్టోకు సంబంధించిన డేటాను సేకరిస్తుంది. ఆయా అకౌంట్లకు సంబంధించిన వివరాలను దొంగిలిస్తుంది. ఫింగర్ ప్రింట్స్ సహా ఇతర వివరాలను ఈజీగా సేకరిస్తుంది.
ఈ మాల్వేర్ ఎలా పని చేస్తుందంటే?
షార్క్ బాట్ డ్రాపర్ గా పిలిచే ఈ మాల్వేర్.. ఆయా యాప్‌ల ద్వారా వినియోగదారుల ఫోన్లలో ఇన్‌స్టాల్ అయిన తర్వాత పని చేయడం మొదలు పెడుతుంది. వెంటనే లాగిన్ విత్ ఫింగర్ ప్రింట్ అనే సెక్యూరిటీ ఆప్షన్ ను తొలగిస్తుంది. దీంతో కస్టమర్లు తమ పాస్ వర్డ్, యూజర్ వివరాలను టైప్ చేస్తారు. ఈ వివరాలను మాల్వేర్ సేకరిస్తుంది. వాస్తవానికి మాల్వేర్ ల నుంచి రక్షణ పొందడానికి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తుంది. వినియోగదారులు నమ్మి ఇన్ స్టాల్ చేస్తే.. ఇక అంతే సంగతులు. వారి ఫోన్ వివరాలన్నీ సేకరిస్తుంది. అనంతరం ఆటోమేటిక్ సిస్టమ్ ట్రాన్స్ ఫర్ పద్దతిని ఉపయోగించి.. ఆయా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును ఆటోమేటిక్ గా ట్రాన్స్ ఫర్ చేస్తుంది.
ఇప్పటికే 50 వేలకు పైగా డివైజ్ లలోకి మాల్వేర్
ఈ మాల్వేర్ ఇప్పటికే వేల ఫోన్లలో చేరిపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మాల్వేర్ ఉన్న మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్ ను 50 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. వైట్, బ్లూ కలర్ లో ఉండే ఈ యాప్ ఇండియాలోని ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. అటు Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ మాత్రం భారత్ లో కనిపించడంలేదు. విదేశాల్లో దీన్ని ఇప్పటికే 10 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేసుకోవడానికి యాప్ లు సులభమైన పద్దతి. అందుకే సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ వినియోగదారులను వీటితో టార్గెట్ చేస్తున్నారు.
క్రిప్టో మైనింగ్ మాల్వేర్
అటు గూగుల్ ట్రాన్స్ లేట్ అనే మరో నకిలీ యాప్ ద్వారా క్రిప్టో మైనింగ్ మాల్వేర్ ఇప్పటికే వేలాది డివైజ్ లలోకి ఎంటర్ అయినట్లు నిపుణులు చెప్తున్నారు. నిటోకోడ్ అనే క్రిప్టో మైనింగ్ మాల్వేర్ ను టర్కీకి చెందిన ఓ సంస్థ రూపొందించినట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థ గూగుల్ ట్రాన్స్‌లేషన్ కోసం డెస్క్ టాప్ అప్లికేషన్ గా దీన్ని తయారు చేసింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వినియోగదారుల నుంచి క్రిప్టో మైనింగ్ పనులు మొదలు పెట్టినట్లు తెలుసుకున్నారు. అందుకే గుర్తింపు పొందిన యాప్ లను మాత్రమే వినియోగదారులు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.