Redmi Note 13R Launched: రెడ్‌మీ నోట్ 13ఆర్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 12ఆర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, ఐదు వేరియంట్లలో రెడ్‌మీ నోట్ 13ఆర్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 6.79 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. హైపర్ఓఎస్, ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, 50 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


రెడ్‌మీ నోట్ 13ఆర్ ధర (Redmi Note 13R Price)
చైనాలో ఈ ఫోన్ ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,399 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.19,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.23,000) ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 2,199 యువాన్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.25,000) పెట్టాల్సిందే. ఐస్ క్రిస్టల్ సిల్వర్, లైట్ సీ బ్లూ, మిడ్‌నైట్ డార్క్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.


రెడ్‌మీ నోట్ 13ఆర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi Note 13R Features)
షావోమీ రూపొందించిన హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 13ఆర్ రన్ కానుంది. ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను రెడ్‌మీ అందించింది.


బ్లూటూత్, గ్లోనాస్, గెలీలియో, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలరేషన్ సెన్సార్, ఈ-కంపాస్, డిస్టెన్స్ సెన్సార్, వర్చువల్ గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్లను కూడా అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.


Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!