రియల్‌మీ 8 సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్‌లోకి లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‍లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో, రియల్‌మీ 8 5జీ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ (Realme 8s) ఫోన్లను తీసుకురానున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు. 'ఆస్క్ మాధవ్' అనే పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. రియల్‌మీ 8 సిరీస్‍లో మరిన్ని ఫోన్లను తయారు చేస్తున్నామని చెప్పారు. 'ఏది ముందు కావాలి? రియల్‌మీ 8ఐ ఫోనా? లేక రియల్‌మీ 8ఎస్ ఫోనా?' అని కార్యక్రమంలో పాల్గొన్న వారిని అడిగారు. దీంతో ఈ రెండు పేర్లతో కొత్త ఫోన్లు రానున్నాయని వార్తలు వచ్చాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్లను మాత్రం వెల్లడించలేదు. 


6.5 అంగుళాల డిస్‌ప్లే..
గత నెల చివరిలో రియల్‌మీ 8ఎస్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫొటోలు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో పనిచేయనుంది. 6.5 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉండనున్నాయి. వీటితో పాటు అదనంగా 5 జీబీ వర్చువల్ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. 


Also Read: Realme C11 Launched in India: రూ.7 వేల ధరలో రియల్‌మీ స్మార్ట్ ఫోన్..



5000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ..
బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌‌గా ఉండనుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంటుందని సమాచారం. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండనుంది. మిగతా రెండు సెన్సార్ల వివరాలు తెలియరాలేదు. ఇందులో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అందించనున్నారు. 


వాల్యూమ్ రాకర్..
రియల్‌మీ 8ఎస్ ఫోనులో వాల్యూమ్ రాకర్ ఉండనుంది. ఫోన్ ఎడమ భాగంలో సిమ్ కార్డు ట్రే.. కుడి వైపు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనున్నాయి. దీనిని రెండు సార్లు క్లిక్ చేస్తే పవర్ బటన్‌లా పనిచేస్తుంది. ఈ ఫోన్ కలర్ ఆప్షన్లలో పర్పుల్ ఉన్నట్లు తెలిసింది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉండనున్నాయి. 


Also Read: Realme Watch 2: రియల్‌మీ కొత్త వాచ్‌లు వచ్చేసాయి.. ధర, ఫీచర్లు ఇవే..