దిల్లీ ఓల్డ్ నంగల్ ప్రాంతంలో ఇటీవల హత్యాచారానికి బలైపోయిన మైనర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. వారికి జరిగిన అన్యాయంపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.
ఈ ఘటన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆమె కేవలం దళిత కూతురు మాత్రమే కాదని నేషన్స్ డాటర్ అని ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ తర్వాత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా బాధిత కుటుంబాన్ని కలిశారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిందుతలకు కఠిన శిక్ష అమలు జరిగేలా చూస్తామన్నారు.
పలు సెక్షన్లపై కేసులు..
బాధితురాలి తల్లి నిందితులను గుర్తించిన అనంతరం ఆగస్టు 2న ఓ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు నిందుతులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 302(హత్య), 506 (బెదిరింపు), 204 (డిస్ట్రక్షన్ ఆఫ్ అవిడెన్స్) సహా పోక్సో, ఎస్సీఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
నిందితులకు మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
ఏం జరిగింది?
దేశ రాజధాని దిల్లీలో ఇటీవల 9 ఏళ్ల బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనలు చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. నిందతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.