మహిళా ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఓ ఎస్సైపై వేటు పడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో.. ప్రాథమిక విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. వేధింపులు తట్టుకోలేని మహిళా ట్రైనీ ఎస్సై సీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో అది ఎస్సై సస్పెన్షన్‌కు దారి తీసింది. 


Also Read: TS EAMCET 2021: ఇవాల్టి నుంచే ఎంసెట్ పరీక్ష, కరోనా వేళ కొత్త నిబంధనలివీ.. ఈ వస్తువులకు నో ఎంట్రీ


ఎస్సై శిక్షణలో భాగంగా మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు 15 రోజుల క్రితం తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలోని మరిపెడకు కేటాయించడంతో ఆ స్టేషన్‌కు వచ్చారు. ఆ రోజు నుంచి అదే స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో పెద్ద మొత్తంలో నల్ల బెల్లం ఉన్నట్లు తనకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని, దానిపై రైడ్ చేసేందుకు శ్రీనివాస్‌ రెడ్డి తనను వెంటబెట్టుకుని వెళ్లారని ట్రైనీ ఎస్‌ఐ వాపోయారు. ఆ తర్వాత తనను అటవీప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి ప్రయత్నించారని ఆరోపించారు. డ్రైవర్ లేకుండా తనను మాత్రమే తీసుకెళ్లినట్లు బాధితురాలు వెల్లడించింది.


అయితే, ఈ విషయంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విషయం వివరించినా.. వారి నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. అయితే, వారి కుటుంబ సభ్యుల సాయంతో యువతి మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌ జోషిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో శాఖాపరమైన విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ ఐజీ, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ డీఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 


Also Read: Hyderabad: మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ఇద్దరు కార్మికులు.. ఒకరి మృతదేహం వెలికితీత, కొనసాగుతున్న గాలింపు


ఎస్సై శ్రీనివాస్‌ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని రుజువైతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ఎస్సై ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన వారు. 2014లో ఎస్సై బ్యాచ్‌కు చెందిన వారు. తొలుత కే సముద్రం, అనంతరం గార్లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి మట్టెవాడకు.. ఏప్రిల్‌ 14న మరిపెడకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.


Also Read: కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ