టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. దేవినేని బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నుంచి సానుకూల స్పందన లభించింది. ఆయనపై కృష్ణాజిల్లా జి.కొండూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇదివరకే హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగియగా, తీర్పు నేటికి వాయిదా వేసింది. విచారణ ముగియడంతో మాజీ మంత్రి దేవినేనికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.


తనపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని, తాను ఏ తప్పు చేయలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మొదట్నుంచీ చెబుతున్నారు. ఫిర్యాదుదారుడు ఎవరో తనకు అసలు తెలియదని, ఆయన సామాజిక వర్గం ఏమిటో కూడా తనకు తెలియదని దేవినేని అన్నారు. ఇదే విషయాన్ని దేవినేని తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. పోలీసులు మాజీ మంత్రిని తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన అక్రమ మైనింగ్ విషయం తెలుసుకున్న దేవినేని ఉమ పరిశీలనకు మాత్రమే వెళ్లారని ఆయన లాయర్ కోర్టుకు తెలిపారు.


Also Read: River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!


మైనింగ్‌ పరిశీలనకు వెళ్లినప్పుడు పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దేవినేనిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. తనకు బెయిట్ మంజూరు చేయాలని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దేవినేని ఉమ బెయిట్ దరఖాస్తు పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి.. ఇరువైపుల వాదనలు పూర్తి చేసింది. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 


కాగా, మైనింగ్ వద్దకు పరిశీలనకు వెళ్లిన తనపై దాసరి సురేశ్‌ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశార ని టీడీపీ నేత ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే దేవినేని ఉమపై కేసు పెట్టారని, ఫిర్యాదుదారుడి ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు ఆధారాలతో వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. దేవినేని ఉమకు బెయిల్ మంజూరు కావడపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: AP Pensions Late: ఏపీ సర్కార్‌పై నమ్మకం పోతోందా.. కేంద్రమే పెన్షన్ ఇవ్వాలని కోరనున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు