బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు కేరాఫ్ అయిన రియల్‌మీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సి 11 (2021) పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. గతేడాది రియల్‌మీ నుంచి వచ్చిన సి 11 ఫోన్‌కు కొనసాగింపుగా సి 11 (2021) ను అందుబాటులోకి తెచ్చింది. 


రియల్‌మీ సి 11 (2021) 6.5 అంగుళాల హెచ్‌డీ + ఎల్‌సీడీ స్క్రీన్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. యునిసోక్ ఎస్సీ 9863 ఏ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ని 256 జీబీ వరకు పెంచుకునే సదుపాయాన్ని కల్పించారు. 




8 మెగా పిక్సెల్స్ ప్రైమరీ (ఏఐ) కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 3 కార్డ్స్ స్లాట్ (2 సిమ్ + 1 మెక్రో SD) సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కూల్ గ్రే, కూల్ బ్లూ రంగులలో లభిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 89.5 శాతంగా ఉందని సంస్థ పేర్కొంది.


4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ - జీపీఎస్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మాత్రం అందించలేదు. దీని బరువు 190 గ్రాములుగా ఉంది. 


10 వేలలోపు ఫోన్లలో సంచలనం..
స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా వల్ల చదువులు కూడా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. ఆన్‌లైన్ క్లాసులు వినాలనుకునే విద్యార్థులకు ఇదో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని చెప్పవచ్చు. రూ.10 వేల ధరలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందించే కంపెనీల్లో రియల్‌మీ ముందు వరుసలో ఉంది.




ఇటీవలి కాలంలో రియల్‌మీ నుంచి వచ్చిన నార్జో 30ఏ (Realme Narzo 30A, రూ.8,999), రియ‌ల్‌మీ నార్జో 10 ఏ (Realme Narzo 10A, రూ. 8,999), రియ‌ల్‌మీ సి 3 (Realme C 3, రూ. 8,999), రియ‌ల్‌మీ సి 25 (Realme C 25, రూ.9,999), రియ‌ల్‌మీ సి 12 (Realme C 12, రూ.8,999), రియ‌ల్‌మీ సి 15 (Realme C 15, రూ.8,999), రియ‌ల్‌మీ సి 11 (Realme C 11, రూ.7,999) ఫోన్లు భారత మార్కెట్‌లో ఓ సంచలనం అని చెప్పవచ్చు. 


రూ.10 వేల ధర ఉన్న ఫోన్లలో రియల్ మీ నార్జో 30ఏ టాప్ - 10లో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ రంగుల్లో ఇది లభిస్తుంది.