ఇరవై ఏళ్ల క్రితం 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు రాజమౌళి. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడినా క్రెడిట్ మొత్తం మరో డైరెక్టర్ కి వెళ్లింది. కొత్త దర్శకుడు కావడంతో ఆ సమయంలో అందరూ చులకనగా చూశారు. రాజమౌళి అనే వ్యక్తి ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతారని అప్పుడు ఎవరికీ తెలియదు. ఆయన సినిమాలు వేల కోట్లు వసూళ్లు చేస్తాయని ఎవరూ ఊహించి కూడా ఉండరు.
ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నా.. రాజమౌళి మాత్రం నవ్వుతూనే ఉంటారు. అతడు ఏం చేయగలడనేది మాటల్లో చెప్పడం తనకు రాదు. ఆయన చేయాలనుకున్నది ఎంత కష్టమైనా.. అసాధ్యమైనా సాధించుకొని తీరతారు. మాస్టర్ స్టోరీ టెల్లర్, దర్శకధీరుడు, బాక్సాఫీస్‌కే బాహుబలి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు కూడా ఆయనకి సరిపోవు. తను క్రియేట్ చేసిన రికార్డులను తను మాత్రమే బ్రేక్ చేయగలరు. ప్రపంచం మెచ్చిన స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడుతుంటారు.
ఆయన ఆలోచనల్లో నుండి పుట్టిన సినిమాలే 'ఈగ', 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'. అప్పటివరకు తెలుగులో స్పోర్ట్స్ డ్రామా టచ్ చేయాలనే భయపడి వెనక్కి వెళ్లేవారు. అలాంటి సమయంలో 'సై' లాంటో స్పోర్ట్స్ ఫిలిం తీసి హిట్టు కొట్టి చూపించారు. ఎన్టీఆర్ తోనే ఇప్పటివరకు మూడు సినిమాలు తీసి ఆయన కెరీర్ ను మలుపు తిప్పారు. ఇక రామ్ చరణ్ తో తీసిన 'మగధీర' సినిమా ఒక సంచలనం. ఈ సినిమాను రీమేక్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారంటే.. రాజమౌళి సత్తా ఏంటో తెలుస్తుంది.
తన సబ్జెక్ట్ కి స్టార్ హీరోలతో అవసరం లేదని ఈగను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ఎంతటి భారీ సక్సెస్ ను అందుకుందో తెలిసిందే. రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్, రాజమౌళిలకు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఒక రాజ్యం.. దాని సింహాసనాన్ని దక్కించుకోవడం కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథను తీసుకొని 'బాహుబలి' లాంటి మాగ్నమ్ ఓపస్ ను రూపొందించారు.
చిన్న కథైనా.. రాజమౌళి విజన్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కో ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా చూపిస్తూ.. తన క్రియేటివిటీతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఒక్క 'బాహుబలి' కోసమే ఐదేళ్ల సమయం కేటాయించినప్పటికీ.. మరో వందేళ్ల తరువాత అయినా ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకునేలా తీశారు. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయి. దీన్ని పాన్ ఇండియా సినిమా అనేకంటే వరల్డ్ సినిమా అని చెప్పుకోవడం బెటరేమో. ఇప్పటికే ఇండియన్ సినిమా రేంజ్ ని ఆకాశానికెత్తేసిన రాజమౌళి మరి 'ఆర్ఆర్ఆర్'తో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి!