ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ల మధ్య ఫైట్ రోమ్ నగరం వేదికగా జరగనుంది. రోమ్ నగరంలోని పురాతన సెటప్‌లో ఈ పోరు జరగనుంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ ఫైట్ యూఎఫ్‌సీ ఆధ్వర్యంలో జరగబోదని, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్లు ఈ పోటీని నిర్వహిస్తాయని కూడా ఎలాన్ మస్క్ తెలిపాడు. కెమెరాలో కనిపించే ప్రతి ఫ్రేమ్ పురాతన రోమ్ తరహాలోనే ఉంటుందని, ఇప్పటిలా ఏమీ ఉండదని పేర్కొన్నాడు. ఈ విషయమై ఇటలీ ప్రధాన మంత్రి, అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. లొకేషన్ విషయంలో వారి అంగీకారం దొరికినట్లు తెలిపాడు.
ఈ పోరులో జరిగే ప్రస్తుత, ప్రాచీన ఇటలీకి గౌరవప్రదంగా ఉంటుందని ట్వీట్ చేశాడు. మెటా, ఎక్స్ ప్లాట్‌ఫాంల్లో ఈ పోరాటాన్ని లైవ్ ద్వారా చూడవచ్చు. ఫైట్ ద్వారా వచ్చే మొత్తం నగదు అమెరికా మిలటరీ సంస్థ అయిన ‘వెటరన్స్’కు చేరుతుంది.
నిజానికి ఈ పోరు ఇప్పటికే జరగాల్సింది. కానీ ఎలాన్ మస్క్‌కు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఫైట్ ఇప్పటి వరకు జరగలేదు. సాధారణంగా ఎలాన్ మస్క్ దూకుడైన వ్యక్తి. మార్క్ జుకర్‌బర్గ్ కాస్త ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఈ పోరు విషయంలో మాత్రం మార్క్ జుకర్‌బర్గ్ ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మస్క్ ఎప్పుడంటే అప్పుడు తాను పోరుకు సిద్ధం అని, తాను మస్క్‌కు ఒక డేట్ కూడా ప్రపోజ్ చేశానని, కానీ అతని వైపు నుంచి ఆలస్యం జరుగుతుందని మార్క్ జుకర్‌బర్గ్ గతంలో థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు.
గత జూన్‌లో వరుస సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్‌కు అంగీకరించారు. మొదట్లో దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగినా జూన్ నెలాఖరుకు ఈ పోరాటంపై చర్చ ఆగిపోయింది. మార్క్ జుకర్‌బర్గ్ అయితే పోటీ అసలు జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితిని, అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం ట్విటర్‌ని ఎక్స్‌గా రీబ్రాండింగ్‌లో నిమగ్నమై ఉన్న ఎలోన్ మస్క్, కేజ్ ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని యూఎస్ వెటెరన్స్ సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు.
దీని తరువాత ట్విట్టర్ సీఈవో లిండా యాకారినో కూడా ఎలాన్ మస్క్ ట్వీట్‌పై వ్యాఖ్యానించారు. ఈ గొప్ప మ్యాచ్‌ని చూడటానికి తన క్యాలెండర్‌ను క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. మార్క్ జుకర్‌బర్గ్ ఉత్సాహంతో, శస్త్రచికిత్స గురించి మస్క్ చేసిన ఇటీవలి ప్రకటనలతో జరగబోయే పోరాటంపై ఇరుపక్షాలు సమానంగా ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial