జోరుగా వర్షాలు కురుస్తున్నాయ్. ఈ వర్షాల్లో మీతోపాటు మీ ఫోన్ కూడా తడిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక మీరు ఫోన్ గురించి మరిచిపోవల్సిందే. ఎందుకంటే, కొన్ని ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ కావు. కొంచెం నీళ్లు చేరినా.. మొత్తం ఫోన్ పాడైపోతుంది. అయితే, వర్షంలో తడిచిన ఫోన్‌ను ఎలా పడితే అలా ఆరబెట్టే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. బాగున్న ఫోన్ కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. తడిచిన ఫోన్‌ను కొందరు డ్రయ్యర్స్‌తో ఆరబెట్టే ప్రయత్నం చేస్తారు. అది కూడా ప్రమాదమే. ఎందుకంటే, డ్రైయ్యర్స్ నుంచి వెలువడే వేడి గాలుల వల్ల ఫోన్లోని సున్నితమైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్ని ఫోన్లు వర్షంలో తడిచినా సరే ఆన్ అవుతాయి. అది బాగానే పనిచేస్తుంది కదా అని ఛార్జింగ్ పెట్టకండి. అలా చేస్తే మీరు ప్రమాదంలో చిక్కుకుంటారు. భారీ పేలుడు, లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ముప్పు పొంచివుంది. మరి, తడిచిన ఫోన్‌ను ఎలా ఆరబెట్టాలి? ఎలాంటి విధానాలు పాటించాలి. వర్షాకాలంలో ఫోన్లు తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? 


వర్షంలో ఫోన్ తడిచిపోతే ఏం చేయాలి?: 


⦿ మీ ఫోన్ వర్షంలో తడిచినట్లయితే.. వెంటనే ఆన్ చేయొద్దు. ముందుగా ఫోన్ స్విచ్చాఫ్ చేయండి.
⦿ ఆ తర్వాత ఫోన్ బ్యాటరీ తొలగించండి. (అయితే, ఇది కొన్ని ఫోన్లకు బ్యాటరీ తీయడం వీలు కాదు). 
⦿ తడిచిన ఫోన్‌కు ఛార్జింగ్ కూడా పెట్టవద్దు. 
⦿ ఫోన్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్ కూడా ఉపయోగించవద్దు. 
⦿ అందులోని నుంచి సిమ్‌ను కూడా తొలగించండి.
⦿ వేరొక ఫోన్ అందుబాటులో ఉంటే సిమ్‌ను అందులో వేసి ఉపయోగించండి.
⦿ తడిచిన ఫోన్‌ను రాత్రంతా బియ్యంలో పెట్టండి. 
⦿ బియ్యంలో పెట్టడం వల్ల ఫోన్లకు చేరిన నీరు తొలగిపోతుంది. 
⦿ ఫోన్‌లోని తేమ మొత్తాన్ని బియ్యం పీల్చేసుకుంటుంది. 
⦿ తడిచిన ఫోన్లను ఆరబెట్టేందుకు మార్కెట్లో సిలికా జెల్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి.
⦿ బియ్యం అందుబాటులో లేకపోతే సిలికా జెల్ ప్యాకెట్ల మధ్య ఉంచండి.
⦿ ఫోన్ ఆరిన తర్వాత కూడా పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి.
⦿ ఒక వేళ సిలికాన్ జెల్ ప్యాకెట్లు అందుబాటులో లేకపోతే టేబుల్ ఫ్యాన్ ద్వారా ఫోన్‌ను ఆరబెట్టేందుకు ప్రయత్నించండి. 
⦿ సిమ్, మెమరీ కార్డ్ ట్రేను ఓపెన్ చేసి ఉంచండి. 


ఫోన్ తడవకూడదంటే వీటిని వాడండి: 


⦿ మొబైల్ కోసం వాటర్ ప్రూఫ్ ఫోన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రూ.99కే ఈ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణాల సమయంలో ఇలాంటి కవర్లు బాగా ఉపయోగపడతాయి. 
⦿ సిలికా జెల్ ప్యాకెట్‌లతో కూడిన జిప్‌లాక్ పర్సులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొబైల్ ఫోన్లలోకి తేమను చేరనివ్వవు. అలాగే, వర్షంలో తడిచిన తర్వాత ఫోన్‌ను డ్రై చేసుకొనేందుకు ఉపయోగపడతాయి. ఇవి కూడా ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 
⦿ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు: వాటర్ ఫ్రూఫ్ కేస్ లేదా, జిప్‌లాక్ పర్సులు అందుబాటులో లేకపోతే. మీ ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచుకోవడం బెటర్. మరి, ఫోన్లు వస్తే ఎలా అనేగా మీ సందేహం. ఇందుకు మీరు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ లేదా, ఇయర్ బడ్స్ వాడితే చాలు. ఫోన్ బ్యాగ్‌లో ఉన్నా కాల్స్ మిస్ కారు. కొన్ని హెడ్‌పోన్స్ వాటర్‌లో తడిచినా ఏమీ కావు. 


Also Read: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!


Also Read: రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!