Samsung Galaxy S21 FE 5G With Snapdragon 888 SoC: క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ తిరిగి లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే సరిగ్గా ఏరోజు లాంచ్ కానుందో మాత్రం కానుందో మాత్రం తెలియరాలేదు. అయితే జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ధరకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఫ్యాన్ ఎడిషన్ మనదేశంలో గతేడాది జులైలో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు అందులో ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను అందించారు.


ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధరను ట్విట్టర్ ద్వారా లీక్ చేశారు. దీని ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో రూ.49,999 ధరతో లాంచ్ కానుంది. ఆఫర్ల ద్వారా రూ.44,999కు తగ్గిపోనుంది. మరో టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ కొత్త మోడల్ జులై 10వ తేదీన లాంచ్ కానుందని తెలిపారు.


ఒకవేళ ఈ లీక్ నిజమైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ కంటే త్వరలో లాంచ్ కానున్న మోడల్ చాలా ఎక్కువ ధరతో లాంచ్ కానుంది. ప్రస్తుతం శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లో రూ.32,999కే శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ పాత వెర్షన్ లిస్ట్ అయింది. గతేడాది జనవరిలో ఈ స్మార్ట్ ఫోన్ రూ.54,999తో మార్కెట్లో లాంచ్ అయింది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ (పాత వెర్షన్) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముందువైపు అందించిన 32 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.


ఈ వేరియంట్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్‌ టచ్ శాంప్లింగ్ రేట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌కు భద్రత లభించనుంది.


4500 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. 25W సూపర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ (పాత వెర్షన్) పనిచేయనుంది. త్వరలో లాంచ్ కానున్న కొత్త వెర్షన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ అందించనున్నారు. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్‌ ఈ ఫోన్‌లో ఉంది. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు కూడా అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.


Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial