రెడ్‌మీ కే60 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే స్క్రీన్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


రెడ్‌మీ కే60 అల్ట్రా ధర
ఇందులో ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,599 యువాన్లుగా (సుమారు రూ.30,000) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.32,000) ఉంది. ఇక 16 జీబీ ర్యామ్ + 512 స్టోరేజ్ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,350) నిర్ణయించారు.


టాప్ ఎండ్ మోడల్స్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లుగానూ (సుమారు రూ.38,000), 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగానూ (41,200) ఉంది. ప్రస్తుతానికి వీటిని చైనాలో మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో, మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సంగతి ఇంకా తెలియరాలేదు. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ కే60 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ కే60 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రెడ్‌మీ కే60 అల్ట్రాలో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌ను రెడ్‌మీ కే60 అల్ట్రాలో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెడ్ ఫోన్ జాక్‌ను అందించలేదు. ఐపీ68 రేటింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


మరోవైపు రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ మొబైల్‌లో ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ‌్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. లేటెస్ట్‌గా లాంచ్ అయిన అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial