Realme 14x 5G Specifications: మీరు కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్‌ని కొనాలని ప్లాన్ చేస్తుంటే రియల్‌మీ మీ కోసం కొత్త ఫోన్‌ని తీసుకువస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ వచ్చే వారం భారతదేశంలో రియల్‌మీ 14ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. డిసెంబర్ 18వ తేదీన విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌ల్లో వస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ ట్విట్టర్‌లో దాని డిజైన్ గ్లింప్స్ కూడా చూపింది. ఇది ఒక ఫ్లాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మీ 12ఎక్స్‌కి తర్వాతి వెర్షన్‌గా ఉంటుంది. రియల్‌మీ 12ఎక్స్‌తో పోలిస్తే కొత్త స్మార్ట్‌ఫోన్‌లో చాలా కొత్త ఫీచర్లు ఉంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


రియల్‌మీ 14ఎక్స్ 5జీలో ఏయే ఫీచర్లు ఉంటాయి?
ఇప్పటివరకు వచ్చిన లీక్స్, వివిధ నివేదికల ప్రకారం ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లను కలిగి ఉంటుంది. టాప్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రానుంది. రాబోయే ఫోన్‌లో డైమండ్ కట్ డిజైన్‌తో గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్ ఉంటుందని, కెమెరా సెటప్ రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుందని టీజర్‌ను బట్టి చెప్పవచ్చు. కెమెరా సెటప్‌లో రెండు సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


డిస్‌ప్లే గురించి చెప్పాలంటే ఇది 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పవర్ కోసం ఇది శక్తివంతమైన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ69 రేటింగ్ పొందింది. దీని పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. వాల్యూమ్ బటన్‌లు కుడి వైపున ఉంటాయి.


ధర ఎంత ఉండవచ్చు?
ఆసక్తి ఉన్న కస్టమర్లు రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇది రెండు వెబ్‌సైట్‌ల మైక్రోసైట్‌లో లిస్ట్ అయింది. దీని ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రేటు రూ.11,999 నుంచి ప్రారంభం కావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.15,000 కంటే తక్కువ ధరతో ఐపీ69 రేటింగ్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?