భారతదేశంలో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కంపెనీ ఊరట కల్పించింది. గత కొంతకాలంగా వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు అప్‌డేట్ చేస్తే స్క్రీన్‌పై గ్రీన్ కలర్ లైన్ వస్తుంది. ఈ సమస్య వచ్చిన స్మార్ట్ ఫోన్లకు ప్రారంభంలో వారంటీ ఉంటేనే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఇచ్చేవారు. వారంటీ లేని వారికి ఈ సమస్య వస్తే స్క్రీన్ కోసం నగదు చెల్లించాల్సి వచ్చేది. కంపెనీ అధికారిక స్టోర్‌లో స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఎంత ఖరీదైనదో మనకు తెలియనిది కాదు. ఫోన్ ధరలో దాదాపు 20 నుంచి 25 శాతం పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యకు వన్‌ప్లస్ ఒక పరిష్కారంతో వచ్చింది.


స్క్రీన్ మీద గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిన ఫోన్లకు కంపెనీ లైఫ్‌టైమ్ స్క్రీన్ వారంటీని అందిస్తుంది. దీంతో వినియోగదారులు ఒకవేళ తమ స్మార్ట్ ఫోన్‌కు ఈ సమస్య తలెత్తితే ఉచితంగా స్క్రీన్‌ను మార్చుకోవచ్చు. అయితే ఇది ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. ఎన్నిసార్లు సమస్య వస్తే అన్ని సార్లూ ఉచితంగా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.


ఆక్సిజన్ఓఎస్ 13 స్టేబుల్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకున్నాక చాలా మంది వినియోగదారులకు స్క్రీన్‌పై గ్రీన్ లైన్ సమస్య తలెత్తింది. దీంతో వినియోగదారులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా రిపోర్ట్ చేశారు.


వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్‌లో కొన్ని ఫోన్లకు ఈ సమస్య తలెత్తితే రిపేర్‌కి బదులుగా కొంత మొత్తానికి ఓచర్ అందించనున్నారు. కానీ ఆ ఓచర్‌తో మీరు మరో వన్‌ప్లస్ డివైస్ మాత్రమే కొనగలరు. ఇతర ఉత్పత్తులు కొనడానికి ఆ ఓచర్ పనికి రాదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ ఓచర్ ఉపయోగపడుతుంది.


వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా నిర్ణయించారు. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే రంగుల్లో వన్‌ప్లస్ నార్డ్ 3 కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అమెజాన్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది.


ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 3 పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్‌ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ ఉంది. 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial