ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ సిరీస్. ఈ సిరీస్‌లో మొదటి ఫోన్ వన్‌ప్లస్ ఏస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


వన్‌ప్లస్ ఏస్ ధర
ఇందులో నాలుగు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (సుమారు రూ.29,600) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 యువాన్లుగానూ (సుమారు రూ.31,900), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగానూ (సుమారు రూ.35,400) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను 3,499 యువాన్లకు (సుమారు రూ.41,400) కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో వన్‌ప్లస్ 10ఆర్ పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.


వన్‌ప్లస్ ఏస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు.


12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కే3పీ9 సెన్సార్‌ను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 186 గ్రాములుగా ఉంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?