Moto G35 5G Price in India: మోటో జీ35 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో డిసెంబర్ 10వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. లాంచ్ డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ టీజ్ చేసింది. మోటో జీ35 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో ఆగస్టులో లాంచ్ అయింది. యూనిసోక్ టీ760 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే అందించారు. మోటో జీ35 స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.

డిసెంబర్ 10వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది కాబట్టి ఫ్లిప్‌కార్ట్ దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ను ప్రారంభించింది. ఈ లిస్టింగ్ ప్రకారం మోటో జీ35 5జీ ధర రూ.10 వేలలోపే ఉండనుంది. ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన 5జీ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ 12 5జీ బ్యాండ్లతో మార్కెట్లోకి రానుందని పేర్కొంది.

యూరోపియన్ మార్కెట్లలో ఈ ఫోన్ 199 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.19,000) నుంచి ప్రారంభం కానుంది. ఇంతకు ముందు మనదేశంలో లాంచ్ అయిన మోటో జీ34 స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. ఇందులోనే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. 

Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?

డిసెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లోనే జరగనుంది. బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటో జీ35 5జీ స్పెసిఫికేషన్లుఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా అందించనున్నారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా అందించనున్నారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ పక్కభాగంలో అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్‌లో చూడవచ్చు.

Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!