స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మూడేళ్ల తర్వాత భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. రియల్‌మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ ‘హానర్’ బ్రాండ్‌తో కలిసి పని చేయనున్నారు. హానర్ టెక్ ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించాలనే ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించింది. దీన్ని బట్టి ఇప్పుడు ఆ కంపెనీ మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోందని స్పష్టమవుతోంది. హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో తిరిగి కంపెనీ భారతదేశంలో రీ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.


హానర్ ఈ నెల ప్రారంభంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు తిరిగి వస్తున్నట్లు ట్వీట్ చేసింది. మూడేళ్ల తర్వాత దేశంలో తన తొలి డివైస్‌ను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హానర్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతాయని మాధవ్ సేథ్ చేసిన ట్వీట్ క్లారిటీ ఇచ్చింది. రియల్‌మీ భారతదేశంలో బలమైన బ్రాండ్‌గా ఎదగడానికి మాధవ్ సేథ్ కృషి, వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయి.


2020లో హువావే నుంచి విడిపోయిన వెంటనే హానర్ భారతదేశం నుండి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. గత మూడు సంవత్సరాలలో హానర్ బ్రాండ్ క్రింద వేరబుల్స్, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు... ఇలా అనేక రకాల ఉత్పత్తులు లాంచ్ అయ్యాయి.


టెక్నికల్ గురూజీ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడిపే గౌరవ్ చౌదరి... హానర్ 90ని భారతీయ కస్టమర్ల కోసం సెప్టెంబర్‌లో ఆవిష్కరించవచ్చని సూచించారు. ప్రస్తుతానికి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధర గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు.


హానర్ 90 స్మార్ట్ ఫోన్ చైనాలో 2023 ప్రారంభంలోనే లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో ప్రీమియం సెగ్మెంట్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. చైనాలో దీని ధరను 2,499 యువాన్లుగా (సుమారు రూ.28,700) నిర్ణయించారు. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర.


మనదేశంలో హానర్ 90 ధర (అంచనా)
హానర్ 90 స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో రూ.45 వేల రేంజ్‌లో కంపెనీ లాంచ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లకు ఈ ధర పెడితే చాలా ఎక్కువ. మరి ఇండియన్ వెర్షన్‌లో ఈ ప్రాసెసర్ బదులు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అందిస్తారా లేదా అన్నది చూడాలి. గూగుల్ పిక్సెల్ 7ఏ, నథింగ్ ఫోన్ 2, ఐకూ నియో 7 ప్రో, వన్‌ప్లస్ 11ఆర్‌లతో హానర్ 90 పోటీ పడనుంది.


హానర్ 90 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
హానర్ 90లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ప్లస్ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.


5జీ, 4జీ, ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా హానర్ 90 సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా ఈ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial