Google Blocked Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం గూగుల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకంగా 12 లక్షల యాప్‌లను నిషేధించినట్లు తెలిపింది. గత ఏడాది (2021లో) 1.90 లక్షల డెవలపర్స్ అకౌంట్స్‌ను సైతం నిషేధించినట్లు ఓ ప్రకటనలో గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు యాక్టివ్ గా లేని మరో 5 లక్షల వరకు డెవలపర్ అకౌంట్స్‌ను సైతం ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేసింది.


ప్రతి ఏడాది గూగుల్ చర్యలు.. 
గూగుల్ ప్రతి ఏడాది స్మార్ట్‌ఫోన్ యూజర్ల సెక్యూరిటీ కోసం ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నదో తెలుపుతుంది. ఈ క్రమంలో 2021లో మాల్వేర్ యాప్స్, ఫేక్ యాప్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకుని యూజర్స్ ప్రైవసీ, సెక్యూరిటీని కాపాడేందుకు యత్నించినట్లు స్పష్టం చేసింది. గూగుల్ డేటా సేఫ్టీ విభాగం అందించిన వివరాలను సంస్థ వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో ఉన్న యాప్‌ల నుంచి యూజర్ల ప్రైవసీ, భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌లకు డెవలపర్స్ అందించడాన్ని తప్పనిసరి చేసింది గూగుల్ యాజమాన్యం. ఈ విషయాన్ని తాజా బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. 


మాల్వేర్ (Malware), అవాంఛిత సాఫ్ట్‌వేర్ నుంచి స్మార్ట్ ఫోన్ యూజర్లను సురక్షితంగా ఉంచడానికి గూగుల్ నిరంతరం ప్రయత్నిస్తోంది. బిలియన్ల సంఖ్యలో ప్రతిరోజూ యూజర్స్ యాప్ ఇన్‌స్టాల్, అన్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు. వీటిని తమ కంపెనీ ప్రతినిధులు పరిశీలిస్తుంటారని, తద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. ప్రమాదకరం, అనుమానిత యాప్‌లను ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావడానికి గూగుల్ ఆంక్షలు విధించింది. 98 శాతం యాప్స్ ఆండ్రాయిడ్ 11 లేదా ఆ తరువాత వెర్షన్‌ ఓఎస్‌లకు మారుతున్నాయి.


నిషేధిత యాప్స్ ఇలా తెలుసుకోండి.. 
యూజర్ల డేటా భద్రత కోసం గూగుల్ సంస్థ మే నెలలో ఓ ప్రత్యేక విభాగం న్యూట్రిషన్ లేబుల్స్ (Nutrition Labels)ను ప్రారంభించింది. ఇందులో యాప్ డెవలపర్స్ తప్పనిసరిగా యాప్స్‌లో యూజర్స్ ప్రైవసీతో పాటు డేటా సెక్యూరిటీకి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరచాల్సి ఉంటుంది. నిషేధిత, బ్లాక్ చేసిన యాప్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ పేరు సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. గతంలో మీరు వాడుతున్న యాప్స్ ఇప్పుడు ప్లే స్టోర్‌లో కనిపించలేదంటే గూగుల్ ఆ యాప్‌లను ఇదివరకే నిషేధించిందని గ్రహించి, మీ స్మార్ట్ ఫోన్ నుంచి వాటిని అన్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.